AI Movie : వామ్మో! అకిరాతో ఏకంగా సినిమా తీసేసారుగా.. హాలీవుడ్ స్టార్స్ కూడా ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మనిషి ఊహకు అందని పనులూ ఇప్పుడు సులభంగా సాధ్యమవుతున్నాయి. కొందరు ఈ సాంకేతికతను సృజనాత్మక పనులకు వినియోగిస్తుంటే, మరికొందరు దుర్వినియోగం చేసే ఘటనలు కూడా బయటపడుతున్నాయి. సినీ పరిశ్రమలోనూ ఏఐ ప్రభావం పెరుగుతున్న తరుణంలో తాజాగా ఓ వ్యక్తి ఏఐని ఉపయోగించి పూర్తిస్థాయి సినిమానే రూపొందించడం సంచలనంగా మారింది.
Details
గెస్ట్ రోల్ లో పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్
ఈ ఏఐ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్‌నే హీరోగా చూపించారు. హాలీవుడ్ నటి విక్టోరియాను హీరోయిన్‌గా చూపిస్తూ, రజినీకాంత్, విల్ స్మిత్, మోహన్ బాబు, రేణు దేశాయ్, లియోనార్డో డికాప్రియో, జాక్వీన్ ఫీనిక్స్, గౌతమ్ ఘట్టమనేని, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, బ్రిట్నీ పియర్స్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులను గెస్ట్ పాత్రల్లో ప్రతిష్టించారు. గంట నిడివి గల ఈ చిత్రాన్ని'AI Love Story' పేరుతో యూట్యూబ్‌లో నెల క్రితమే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఏఐ లవ్ స్టోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్నాలజీ, లవ్ స్టోరీ, ఇతర గ్రహాలపై సాహసాలు, బ్రెయిన్ డేటా వంటి ఆధునిక కాన్సెప్ట్‌లను కథాంశంగా తీసుకుని, లవ్-సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందించబడింది
Details
సోషల్ మీడియాలో వీడియో వైరల్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా చివరిలో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కలిసి కనిపించడం, మధ్యలో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అకిరా ఎప్పుడు సినిమాలలో ఎంట్రీ ఇస్తాడా అనే సందేహాల్లో ఉన్న ఫ్యాన్స్‌కు, ఈ ఏఐ వీడియో 'ఓ లుక్' ఇచ్చిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. నటీనటులను పూర్తిగా ఏఐతో సృష్టించి సినిమాలు చేసే రోజులు దూరంలో లేవనే వాదనకు ఈ వీడియో తాజా ఉదాహరణగా నిలిచింది. అసలు నటీనటుల ముఖాలను అనుమతి లేకుండా ఏఐలో ఉపయోగించడంపై ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదు.