
Zubeen Garg: సింగర్ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం: అస్సాం సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంకి చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో అనూహ్యంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన (Zubeen Garg) మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం గువాహటి వైద్యకళాశాల ఆసుపత్రిలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. కొన్ని వర్గాల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా సీఎం హిమంత్ వెల్లడించారు.
వివరాలు
పోస్టుమార్టం కోసం జుబీన్ సతీమణి అనుమతి: హిమంత్ బిశ్వశర్మ
''సింగపూర్‌లో ఆధునిక వైద్య సాంకేతికతలు అందుబాటులో ఉన్నందున జుబీన్‌కు మరోసారి పోస్టుమార్టం అవసరం లేదని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కానీ, కొంతమంది వర్గాల డిమాండ్‌ను పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఎటువంటి వివాదాన్ని సృష్టించాలనుకోము. రెండో పోస్టుమార్టం కోసం ఆయన సతీమణి అనుమతి తీసుకున్నాం''' అని సీఎమ్ హిమంత్ బిశ్వశర్మ తెలిపారు. అంతేకాక, జుబీన్ డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నందున, దాన్ని సీఐడీకు అప్పగించనున్నట్లు ఆయన మునుపటే చెప్పిన విషయం తెలిసిందే.
వివరాలు
అధికారిక కార్యక్రమాలతో జుబీన్ గార్గ్ అంత్యక్రియలు
ఈ నెల 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో జుబీన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ వార్తను ఖండించారు. జుబీన్‌ను విహార నౌక ప్రమాదం కారణంగా సింగపూర్ హాస్పిటల్‌కు తరలించామని, అక్కడే ఆయన మృతి చెందారని వారు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆయన శవాన్ని అస్సాంకు తీసుకువచ్చారు. గువాహటిలోని సరూసజయ్ స్టేడియంలో అభిమానులు ఆయనకు చివరి నివాళి అర్పించడానికి సందర్శనానికి వచ్చినట్లు ఏర్పాటు చేశారు. మంగళవారం నగర శివారులో అధికారిక కార్యక్రమాలతో జుబీన్ గార్గ్ అంత్యక్రియలు జరగనున్నాయి.