Page Loader
Btech seats: 171 కళాశాలలు.. 1.14 లక్షల సీట్లు.. ఎప్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం
171 కళాశాలలు.. 1.14 లక్షల సీట్లు.. ఎప్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

Btech seats: 171 కళాశాలలు.. 1.14 లక్షల సీట్లు.. ఎప్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి రాష్ట్రంలోని 171 ప్రభుత్వ,ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కలిపి 1.14 లక్షలకుపైగా బీటెక్‌ సీట్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఎప్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. గత ఏడాది మొత్తం 172 ఇంజినీరింగ్‌ కళాశాలలు రాష్ట్రంలో ఉండగా,వాటిలో కన్వీనర్‌ కోటా,బీ కేటగిరీ కలిపి మొత్తం 1,18,989 సీట్లు ఉండేవి. ఈసారి రాష్ట్రంలోని పాలమూరు,శాతవాహన యూనివర్సిటీల పరిధిలో రెండు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభం కాగా, ఐదు ప్రైవేట్‌ కళాశాలలు తగ్గిపోయాయి. ఈ తగ్గిన ప్రైవేట్‌ కళాశాలలలో రెండింటిని డీమ్డ్‌ యూనివర్సిటీగా మారుస్తే, మరొకటి ప్రైవేట్‌ వర్సిటీలో విలీనం అయింది. మిగిలిన రెండు కళాశాలలు ఈసారి అడ్మిషన్‌కు సంబంధించిన దరఖాస్తు కూడా చేయలేదు.

వివరాలు 

కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసేవి 76,795 

రెండో విడత కౌన్సెలింగ్‌ నాటికి కళాశాలల సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండకపోయినా, సీట్ల పెరుగుదల అవకాశం పూర్తిగా మినహాయించలేమని సమాచారం. కన్వీనర్‌ కోటాలో కౌన్సెలింగ్‌ ద్వారా 76,795 సీట్లు భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అదనంగా, ఎకనామిక్‌ వీకర్‌ సెక్షన్ (EWS) కోటా కింద సుమారు 6,500 సీట్లు మరోసారి అందుబాటులోకి రావచ్చని సమాచారం.