SBI: ఎస్‌బీఐలో 10,000 కొత్త ఉద్యోగాలు.. మార్చి 2024 లోపు నియామకాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది. దాదాపు 10,000 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు ఎస్‌బిఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. సాంకేతిక నైపుణ్యాలను బలోపేతం చేసి, బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే లక్ష్యమని ఆయన వివరించారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆర్థిక సంవత్సరంలో 600 కొత్త శాఖలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్‌బీఐలో సాంకేతిక నైపుణ్యాల పెంపు కోసం వివిధ విభాగాల్లో 1,500 సాంకేతిక నిపుణులను ఇప్పటికే నియమించామని, వారిలో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్‌వర్క్ ఆపరేటర్లు వంటి నిపుణులున్నారని చెప్పారు.
2024 నాటికి ఎస్‌బీఐలో 2,32,296 మంది సిబ్బంది
సంస్థకు 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు అవసరం ఉందని శెట్టి వెల్లడించారు. మార్చి 2024 నాటికి ఎస్‌బీఐలో సిబ్బంది సంఖ్య 2,32,296కి చేరుకుంటుందని అంచనా వేశారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని సాంకేతికంగా మెరుగుపరచేందుకు నిరంతర ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22,542 శాఖలున్నాయని, వాటికి 600 కొత్త శాఖలను జోడించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని శెట్టి వెల్లడించారు.