Loading...
Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు
'10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు

Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్‌ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం అందుకున్న ప్రధాన నిందితురాలు రితుజా పాటిల్‌కు.. అనుమానం రాకుండా కనీసం 10 ప్రశ్నలకు కావాలనే తప్పు సమాధానాలు ఇవ్వాలని పేపర్ లీక్ చేసిన MPSC అధికారులు సూచించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించిన అధికారులు ఈ విషయాలను గుర్తించారు.

vivaralu

'పూర్తి మార్కులు వస్తే అనుమానం'.. ముందే జాగ్రత్తలు

పరీక్షలో రితుజాకు పూర్తి మార్కులు వస్తే అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించిన నిందితులు.. 10 ప్రశ్నలకు తప్పుగా సమాధానాలు ఇవ్వాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు లీక్ చేసిన 294 ప్రశ్నల్లో 77 ప్రశ్నలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

మార్చి 22న పరీక్ష జరగగా.. రితుజాకు మార్చి 20నే ప్రశ్నపత్రం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలో ఆమె ఏడో ర్యాంకు సాధించింది.

వివరాలు 

రూ.5 లక్షల కోసం ప్రియుడిని అడిగిన రితుజా

ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో మరో విషయం కూడా బయటపడింది.

ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు డబ్బు కావాలంటూ రితుజా తొలుత తన ప్రియుడు గౌరవ్ పాటిల్ అలియాస్ లోకేశ్‌ను అడిగినట్లు పోలీసులు తెలిపారు.

పరీక్షకు ముందే MPSC అధికారులకు లంచంగా ఇచ్చేందుకు రూ.5లక్షలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

అయితే ఆర్థికఇబ్బందులు ఉన్నాయని చెప్పిన గౌరవ్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు.

తండ్రి నుంచి రూ.5లక్షలు

దీంతో రితుజా తన తండ్రి అమృత్ పాటిల్‌ను డబ్బులు అడిగింది.

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన అమృత్ పాటిల్ తన కుమార్తెకు రూ.5లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రశ్నపత్రం కోసం ఈ మొత్తాన్ని చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. నాసిక్‌లోని ఓ ఫ్లాట్‌లో ప్రశ్నపత్రం కోసం ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి ద్వారా డీల్

పోలీసుల ప్రకారం.. రూ.5 లక్షల లంచాన్ని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ పాటిల్, నందుర్‌బార్‌కు చెందిన ఓ మధ్యవర్తికి అందించారు.

అనంతరం ప్రవీణ్.. MPSC అధికారులు గోపాల్ మరాఠే, విశ్వేశ్వర్ నకాటే, అభిజిత్ లెండ్వేలను సంప్రదించి ప్రశ్నపత్రాన్ని తీసుకున్నట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు 

ప్రియుడితో సంబంధం తెగిపోవడంతో కేసు వెలుగులోకి..

రితుజా పాటిల్, గౌరవ్ పాటిల్ మధ్య సంబంధం బెడిసికొట్టడంతో ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

పరీక్ష తర్వాత ఇద్దరూ విడిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత రితుజా తనను మరిచిపోయి వేరే జీవితం మొదలుపెడుతుందని గౌరవ్ భయపడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఈర్ష్యతో అతడు MPSCకి ఈమెయిల్ పంపి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తు ముమ్మరమైన తర్వాత గౌరవ్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించాడు.

తాను గందరగోళంలో ఫిర్యాదు చేశానని చెప్పాడు. అయితే విచారణలో కీలక ఆధారం బయటపడింది.

పరీక్షకు రెండు రోజుల ముందే రితుజా లీకైన ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో గౌరవ్‌కు పంపినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాలు 

ఆరుగురు అరెస్టు

గౌరవ్ సోదరుడు కూడా అదే పరీక్ష రాయాల్సి ఉండటంతో ఆమె ప్రశ్నపత్రాన్ని అతడికి పంపినట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో ఫిర్యాదు చేసిన గౌరవ్‌నే పోలీసులు ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు.

ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

వారిలో రితుజా తండ్రి అమృత్ పాటిల్, మధ్యవర్తి ప్రవీణ్ పాటిల్, మాజీ ప్రియుడు గౌరవ్ పాటిల్‌తో పాటు ముగ్గురు MPSC ఉద్యోగులు ఉన్నారు.

అయితే ప్రధాన నిందితురాలు రితుజా పాటిల్ ప్రస్తుతం పరారీలో ఉంది.

వివరాలు 

'ఇది సామూహిక పేపర్ లీక్ కాదు'

ఈ వ్యవహారం సామూహిక పేపర్ లీక్ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రం ఒక్క రితుజా పాటిల్‌కు మాత్రమే లీక్ అయిందని తెలిపారు.

అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా MPSC మొత్తం నియామక ప్రక్రియతో పాటు పరీక్షను రద్దు చేసింది.

రాజకీయ విమర్శలకు దారితీసిన వ్యవహారం

ఈ పేపర్ లీక్‌ వ్యవహారంపై రాజకీయ దుమారం కూడా రేగింది. NCP (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్, భాజపా నేతల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

ఈ అంశంపై సెప్టెంబర్ 1న భారీ నిరసనకు రోహిత్ పవార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ADVERTISEMENT