
CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, సుప్రీంకోర్టు ఆదేశాలు,మార్గదర్శకాలను పాటిస్తూ, 2020లో రద్దయిన జీవో నంబర్ 3 పునరుద్ధరణకు సంబంధించి ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో, సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలు, అనుకూలతలు మరియు ఎదురయ్యే అడ్డంకులపై చర్చ జరిగింది.
వివరాలు
జీవో నంబర్ 3 నేపథ్యం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 1986లో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు.
అయితే, ఈ జీవోపై న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో, పెరిగిన మహిళా రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుని, 2000వ సంవత్సరంలో జీవో నంబర్ 3ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ఈ జీవో వల్ల సుమారు 4,626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు లభించాయి.
అయితే, కొంతమంది ఈ జీవోపై కోర్టును ఆశ్రయించగా, 2020లో సుప్రీంకోర్టు ఈ జీవోను రద్దు చేసింది.
గత ప్రభుత్వం దీనిపై సమర్థవంతంగా రివ్యూ పిటిషన్ వేయడంలో విఫలమైందని, దీనివల్ల గిరిజనులు తమకు లభించే అవకాశాలను కోల్పోయారని చంద్రబాబు మండిపడ్డారు.
వివరాలు
ప్రజల అభిప్రాయాలు కీలకం
జీవో నంబర్ 3 పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనుల నుంచి, అలాగే గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు.
గిరిజనులకు ఈ జీవో ద్వారా తిరిగి లభించగల న్యాయాన్ని సమీక్షించి, అందుకు వీలైన అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు.
న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు అవసరమైన విధానాలపై సమగ్రంగా పరిశీలన జరగాలన్నారు.
వివరాలు
మూడు ప్రత్యామ్నాయాలపై చర్చ
సమీక్ష సమావేశంలో అధికారులు జీవో నంబర్ 3 పునరుద్ధరణకు ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన అవకాశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించడం. స్థానిక గిరిజనుల జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, 50 శాతాన్ని మించకుండా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి హక్కులను కాపాడడం.
ఈ ప్రతిపాదనలపై స్పందించిన చంద్రబాబు.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు తాము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
వివరాలు
మూడు ప్రత్యామ్నాయాలపై చర్చ
ఎన్నికల సమయంలో గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పినట్లే, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలన్నా లేదా సమానమైన లబ్ధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నా, దానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.
ఈ విషయమై జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా సూచించారు.
గిరిజనులకు న్యాయం జరిగేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.