నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా కొన్ని రోజులుగా మరణాలు సంభవిస్తున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో కేవలం 48 గంటల వ్యవధిలో 31 మంది రోగుల మరణించారు. తాజాగా గత ఎనిమిది రోజుల్లో మరో 108 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల వ్వవధిలోనే ఆసుపత్రిలో ఒక చిన్నారి సహా 11 మంది రోగులు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నారు. ఆస్పత్రిలోని మరణాలపై సెంట్రల్ నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడ్ స్పందించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని పునరుద్ఘాటించారు.
ఆస్పత్రిలో తగినంత మందులను నిల్వ చేశాం: డీన్
గత 24 గంటల్లో 1,100 మందికి పైగా రోగులను వైద్యులు తనిఖీ చేసారని, అలాగే 191 మంది కొత్త రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు డీన్ శ్యామ్ వాకోడ్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల్లో సగటు మరణాల రేటు అంతకుముందు 13గా ఉందని, ఇప్పుడు 11కి పడిపోయిందని వాకోడ్ వెల్లడించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలతో మరణించిన పిల్లలే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో తగినంత మందులను నిల్వ చేశామని, సిబ్బంది రోగులందరికీ సహాయం చేస్తున్నట్లు ఆయన వివరించారు. మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదని, వారి ఆరోగ్య పరిస్థితిని క్షీణించడం వల్ల వారు మరణించినట్లు డీన్ చెప్పుకొచ్చారు.