Kandum Mindiyum Iruvar: 'కందుం మిండియుం' వివాదం.. సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?..
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. 'కందుం మిండియుం ఇరువర్' పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రూ.11.21 లక్షల ప్రజాధనం ఖర్చు చేసిన విషయం వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ అంశం అధికార పక్షాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
వివరాలు
ఆర్‌టీఐతో బయటపడ్డ ఖర్చులు
తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన అభ్యర్థనతో ఈ ఖర్చుల వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి మొత్తం రూ.11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది.
వివరాలు
'క్లిఫ్ హౌస్'లో రెండు రోజుల షూటింగ్
ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'క్లిఫ్ హౌస్'లో ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ రెండు రోజుల పాటు జరిగింది. ప్రముఖ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఈ కార్యక్రమాన్ని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో ఈ ఇంటర్వ్యూ రూపొందించబడింది. దీనికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది మొదలైన కథ కూడా ఆసక్తికరమే. తిరువనంతపురంలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఇంటర్వ్యూకు ప్రతిపాదన చేయగా, మోహన్‌లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.
వివరాలు
విపక్షాల విమర్శలు.. రాజకీయ వేడి
ప్రజాధనాన్ని వినియోగించి ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదే తరహాలో మోహన్‌లాల్ 2011 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో కూడా ఇంటర్వ్యూ నిర్వహించిన విషయం గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ చుట్టూ నెలకొన్న వివాదం కేరళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.