Page Loader
Honeymoon Murder: సోనమ్‌-సంజయ్ వర్మల మధ్య 119 కాల్స్‌.. హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు!
సోనమ్‌-సంజయ్ వర్మల మధ్య 119 కాల్స్‌.. హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు!

Honeymoon Murder: సోనమ్‌-సంజయ్ వర్మల మధ్య 119 కాల్స్‌.. హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'హనీమూన్ హత్య' కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సంజయ్ వర్మ అనే కొత్త వ్యక్తి పేరు బయటకు వచ్చింది. మార్చి 1 నుంచి 25 మధ్య సోనమ్‌ అతనితో 119 ఫోన్ కాల్స్‌ మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి అతని ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో రాజా రఘువంశీ హత్యలో అతనికి ఏమైనా పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నట్టు తెలిపారు. సంజయ్‌ వర్మ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నిందితులను ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు.

Details

సోనమ్ తల్లిదండ్రులకు నార్కో టెస్టు చేయాలి

ఇదిలా ఉండగా, మృతుడు రఘువంశీ సోదరుడు ఈ కేసులో కీలక డిమాండ్‌ చేశాడు. సోనమ్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నార్కో టెస్ట్‌ చేయాలని కోరాడు. మొదట రాజాను హత్య చేసినవారు కిరాయి హంతకులని అనుకున్నప్పటికీ, ఆ తరువాత దర్యాప్తులో వారు సోనమ్ ప్రియుడి స్నేహితులుగా గుర్తించారు. మరికొందరు ఈ కుట్రకు సహకరించారని అనుమానంతో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మంగళవారం ప్రధాన నిందితురాలు సోనమ్ సహా మిగతా నలుగురు నిందితులను ఈస్ట్ కాశీ హిల్స్‌లోని సోహ్రా ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు.

Details

ఆర్థిక కోణంలోనూ దర్యాప్తు

అక్కడే నేర పునర్నిర్మాణం (రీకన్‌స్ట్రక్షన్‌) చేపట్టారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న పార్కింగ్ స్థలం, అలాగే జలపాతం ఉన్న లోయ వద్ద ఘటన జరిగిన క్రమాన్ని పోలీసులు రీకన్‌స్ట్రక్ట్ చేశారు. పోలీసుల ప్రకారం, రఘువంశీపై నిందితులు దాడి చేయగానే సోనమ్ అక్కడి నుంచి పారిపోయిందట. అయితే అతను చనిపోయిన తరువాత మళ్లీ ఘటనా స్థలానికి వచ్చి, మృతదేహాన్ని జలపాతం వద్ద పడేయడంలో సహకరించిందని చెప్పారు. ఇంతటితో కాదు, ఈ కేసును ఆర్థిక కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పరిశీలిస్తోంది. పెళ్లయిన కొన్ని రోజుల్లోనే సోనమ్ రాజాపై ఎందుకు అంత ద్వేషం పెంచుకుందనే అంశాన్ని కేంద్రంగా పెట్టుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. సోనమ్‌ను బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.