Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా!
అత్యంత అరుదుగా కనిపించే "నెక్రోటైజింగ్ ఫాసియైటిస్" అనే వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల భవదీప్ కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లో దర్శనమివ్వడం ఆందోళనకరం. భవదీప్ శరీరంలో ఎలాంటి గాయాలు లేకపోయినా, ప్రమాదకర బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ బ్యాక్టీరియా అతని కుడి కాలును పూర్తిగా తినేయడంవల్ల, అతని కాలును తొడ వరకు తొలగించాల్సి వచ్చింది. ఎడమ కాలులోని కండరాలపై 30% నష్టం వాటిల్లింది. నెక్రోటైజింగ్ ఫాసియైటిస్‌కు మరో పేరు "ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్". విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవదీప్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది.
వణుకు..జ్వరంతో.. వ్యాధి ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ కుటుంబం ఈ నెల మొదట్లో వరదలో చిక్కుకుంది. వరదనీరు తగ్గే వరకు భవదీప్ నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు. ఆ రాత్రి వణుకు, చలి, జ్వరం వచ్చిన తర్వాత, స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. కానీ, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ అని భావించారు. ఆ తర్వాత అతని కాళ్లలో వాపు రావడంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో సూక్ష్మక్రిములు కండరాలను నాశనం చేస్తున్నాయని గుర్తించి, కుడి కాలును తొలగించారు.
ప్రమాదజాతుల సూక్ష్మక్రిములే వ్యాధికి కారణం
భవదీప్ శరీరంలో ఈ-కోలి, క్లెబిసెల్లా బ్యాక్టీరియాలు ప్రవేశించాయని వైద్యులు నిర్ధారించారు. వీటిలో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండడం వల్లనే కాలువాపు వచ్చిందని తెలిపారు. వరద నీటిలో మురుగునీరు కలవడం, వ్యాధి కారక సూక్ష్మక్రిములు ఎక్కువగా వ్యాప్తి చెందడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు. అలాగే, భవదీప్‌ను జ్వరంతో బాధపడుతున్న సమయంలో స్థానిక వైద్యుడు ఇచ్చిన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు వ్యాధిని మరింత తీవ్రమైన స్థితికి చేర్చాయని చెప్పారు. ప్రస్తుతం భవదీప్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు, ఎడమ కాలు నెమ్మదిగా నయమవుతోంది. పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.