
Telangana: తెలంగాణా పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగ ఖాళీల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని శాఖల వారీగా ఖాళీల లెక్కలు సేకరించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగ ఖాళీల వివరాలను సమర్పించింది. ఇందులో నేరుగా నియామకాల (Direct Recruitment) విధానంలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంఖ్య, అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు స్పష్టంగా ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ విభాగంలో వివిధ విభాగాలుగా మొత్తం 12,452 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. వీటిలో ఎక్కువగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉండగా,అవి 8,442 ఖాళీలుగా నమోదు అయ్యాయి.
వివరాలు
అన్ని శాఖల సమాచారం రావాలి
అలాగే ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో 3,271 ఖాళీలు, సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) కేటగిరీలో 677 ఖాళీలు, ఏఆర్ ఎస్ఐ పోస్టుల్లో 40 ఖాళీలు, టీజీఎస్పీ విభాగంలో 22 ఖాళీలు ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు పోలీస్ విభాగం నివేదిక సమర్పించింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో కేడర్‌ల వారీగా ఉన్న పోస్టులు, పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్‌లో ఉన్న సిబ్బంది, సెలవులపై వెళ్లినవారి వివరాలు మొదలైన అంశాలపై సమగ్ర సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ప్రతి శాఖ వారీగా సమీక్షలు కొనసాగిస్తోంది.
వివరాలు
జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు
ముఖ్యంగా, ఆయా శాఖల్లో పని భారానికి సరిపడా సిబ్బంది ఉన్నారా? లేకపోతే అదనపు అవసరం ఎంత ఉంది? అనే అంశాలను ఆధారంగా తీసుకుని లోతైన పరిశీలన చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ కమిటీకి పూర్తిస్థాయి, ఖచ్చితమైన వివరాలను సమర్పించాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఈ సమీక్షలు ముగిసిన తర్వాత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఖాళీలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చి, ఉద్యోగ నియామక ప్రక్రియకు రూపకల్పన చేయనుంది. ఆ తర్వాత నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పోలీస్ శాఖ ఖాళీల లెక్కలు సిద్ధం కాగా, మిగిలిన శాఖల వివరాలు సమర్పించాల్సి ఉంది.