LOADING...
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటెయినర్‌ లారీ, 13 మంది సజీవదహనం
13 మంది సజీవదహనం

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటెయినర్‌ లారీ, 13 మంది సజీవదహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన కంటెయినర్‌ లారీ ఢీకొట్టింది. లారీ డివైడర్‌ను దాటి బస్సును ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-48పై గోర్లత్తు క్రాస్‌ వద్ద గురువారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలకు చెందిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వివరాలు 

అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చిన కొందరు ప్రయాణికులు

అతివేగం, దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం తీవ్రతకు బస్సుతో పాటు కంటెయినర్‌ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌,కో-డ్రైవర్‌ బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో గగన, రక్షిత అనే యువతులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సిరా, హిరాయూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాలు 

ప్రయాణికుల్లో కొందరి పేర్లను గుర్తించిన అధికారులు 

ఇదిలా ఉండగా, ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. వారి సమాచారం ప్రకారం బస్సులో మంజునాథ్‌, సంధ్య, శశాంక్‌, దిలీప్‌, ప్రీతీశ్వరన్‌, వి. బిందు, కె. కవిత, అనిరుధ్‌ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం. శశికాంత్‌, విజయ్‌ భండారీ, నవ్య, అభిషేక్‌, హెచ్‌. కిరణ్‌పాల్‌, ఎం. కీర్తన్‌ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement