
Delhi: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న 13ఏళ్ళ బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఒక 13 ఏళ్ల ఆఫ్ఘనిస్థాన్ బాలుడు ఊహకందని సాహసంతో అందరినీ షాక్ కు గురి చేశాడు. విమానం టైర్లు ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఏకంగా కాబూల్ నుంచి దిల్లీకి ప్రయాణించి సురక్షితంగా దిగడంపై అధికారులు సహా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని కందూజ్ పట్టణానికి చెందిన ఈ బాలుడు కాబూల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దృష్టిని తప్పించి లోపలికి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరే కేఏఎం ఎయిర్‌లైన్స్ విమానానికి చేరి, ఎవరూ గమనించకుండా టైర్లపై ఎక్కి, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడు.
వివరాలు
ఢిల్లీలో పట్టుకున్న అధికారులు, అదే విమానంలో వెనక్కి పంపిన వైనం
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ చేసిన వెంటనే, బాలుడు ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో సందేహాస్పదంగా తిరుగుతుండటం భద్రతా సిబ్బంది గమనించారు. అతడిని పట్టుకొని విచారించినప్పుడు అసలు నిజం బయటపడింది. సరదాగా సాహసం చేయాలని భావించి ఇలా చేశానని బాలుడు స్వయంగా చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. తక్షణమే సిబ్బంది విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. బాలుడు దాగిన ప్రదేశంలో చిన్న ఎరుపు రంగు స్పీకర్ మాత్రమే కనిపించింది. ఎలాంటి విద్రోహ చర్యలకు అవకాశం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఆ తర్వాతే అదే రోజు రాత్రి అతన్ని తిరిగి కాబూల్‌కు పంపించారు. ఈ సంఘటనను అధికారులు సోమవారం అధికారికంగా వెల్లడించారు.