Singareni: బొగ్గు గనుల నుంచి సౌర విద్యుత్తు వరకు.. 136 ఏళ్ల సింగరేణి
ఈ వార్తాకథనం ఏంటి
రైతు కూలీలకు ఉపాధి మార్గం చూపిన సిరుల వేణి సింగరేణి సంస్థకు నేటికి 136 ఏళ్ల చరిత్ర ఉంది. ఆరు జిల్లాల్లో విస్తరించి తెలంగాణ రాష్ట్రానికే మకుటాయమానంగా విరాజిల్లుతోంది. 1889లో ఇల్లెందు ప్రాంతంలో'దక్కన్ కంపెనీ'పేరుతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏటా సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశంలోని కీలక ఇంధన సంస్థగా ఎదిగింది. 1920 డిసెంబరు 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకుంది. 1945లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో ఇది తొలి ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. అనంతరం 1950లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన సంస్థలో 1956లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరింది.
వివరాలు
కార్మికుల జీవన ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పు
అప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త యాజమాన్యంతో సింగరేణి కొనసాగుతోంది. ప్రస్తుతం 3,953 పరిశ్రమలు సింగరేణి బొగ్గును వినియోగిస్తున్నాయి.సుమారు 40వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తూ సింగరేణి మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సింగరేణి కార్మికుల జీవనశైలి కాలానుగుణంగా పూర్తిగా మారింది. ఒకప్పుడు నిరక్షరాస్యులుగా పరిగణించబడిన గని కార్మికులు నేడు అంతర్జాతీయ స్థాయిలో జీవించే స్థితికి చేరుకున్నారు. అప్పట్లో ఆరు అణాల కూలికే పనిచేసిన వారు ఇప్పుడు నెలకు రూ.35 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వేతనం పొందుతున్నారు. ఉద్యోగులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో వారి భవిష్యత్తు బాటలు సుగమమయ్యాయి. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 30శాతం మంది పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు.
వివరాలు
విద్యుత్తు రంగంలో అడుగులు.. ఖనిజాల వైపు చూపు
బొగ్గు తవ్వకాలతో పరిమితం కాకుండా సింగరేణి థర్మల్ విద్యుత్తు రంగంలోనూ అడుగుపెట్టింది. ఇదే సమయంలో సౌర విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కర్ణాటకలో రాగి, బంగారు గనుల ద్వారా ఖనిజ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమవుతోంది. ఒడిశాలోని నైనీ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి కొనసాగుతూనే అక్కడే 1,600మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది. 2016లో జైపూర్ వద్ద తొలి దశగా 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జైపూర్‌లోనే 800మెగావాట్ల మూడో యూనిట్‌కు కూడా అనుమతులు పొందింది. సంస్థ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 250.5 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాల ద్వారా ఏటా సుమారు రూ.715 కోట్ల విలువైన విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది.
వివరాలు
సాంకేతికతలో సింగరేణి ముందంజ
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో సింగరేణి ఎప్పటికప్పుడు ముందుంటోంది. 1948 నుంచే యంత్రాల సహాయంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభించి సంప్రదాయ పద్ధతులకు ముగింపు పలికింది. ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి పెంచడమే కాకుండా ప్రమాదాలను కూడా గణనీయంగా తగ్గిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పేలుడు పదార్థాలు వినియోగించకుండా బొగ్గు వెలికితీస్తోంది. ఉపరితల గనుల్లో షవల్-డంపర్ విధానం, ఇన్‌పిట్ క్రషర్ అండ్ కన్వేయర్ బెల్ట్ విధానం, డ్రాగ్‌లైన్ యంత్రాల ద్వారా మట్టి (ఓబీ) తొలగింపు జరుగుతోంది. భూగర్భ గనుల్లో లాంగ్‌వాల్, బ్లాస్టింగ్ గ్యాలరీ పద్ధతులను అమలు చేస్తూ భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి సింగరేణి బాటలు వేసింది.