LOADING...
Landslide hits Bus: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..టూరిస్టు బస్సుపై కొండచరియలు పడి .. 18 మంది మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..

Landslide hits Bus: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..టూరిస్టు బస్సుపై కొండచరియలు పడి .. 18 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
10:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగి పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఘటన సమయంలో బస్సులో 30 నుంచి 35మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌ వైపు ఒక ప్రైవేట్‌ టూరిస్టు బస్సు బయలుదేరింది.

వివరాలు 

రక్షణ చర్యలు ప్రారంభించిన రెస్క్యూ సిబ్బంది

ఆ బస్సు ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్‌ ప్రాంతం వద్దకు చేరుకున్నప్పుడు, కొండచరియలు ఒక్కసారిగా విరిగి వాహనంపై పడ్డాయి. దాంతో బస్సు మొత్తం శిథిలాల కింద చిక్కుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే కొంతమందిని ప్రాణాలతో బయటకు తీయగలిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ తరఫున తగిన సాయం అందజేస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు.