ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సన్నద్ధం, 19మందిని గుర్తించిన నిఘా వర్గాలు
భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది. ఇతర దేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కెనడాలో భారతీయులను ఇబ్బందికి గురి చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. గురుపత్వంత్ సింగ్ కి పంజాబ్ లోని అమృత్ సర్ సమీపంలోని ఖాన్ కోట గ్రామంలో 5.6ఎకరాల భూమి ఉంది. అలాగే చంఢీగర్ లో సొంత నివాసం ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
ఇతర దేశాల్లో నివాసముంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు
భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఐఏ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 19మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించింది. వీరి ఆస్తులను జప్తు చేయడానికి ఎన్ఐఏ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, మోస్ట్ వాంటెడ్ ఖలిస్తాన్ ఉగ్రవాదుల జాబితాలో మొత్తం 43మంది ఉన్నారు. ఈ జాబితాలో ఎక్కువ శాతం మంది ఇతర దేశాల్లో ఉన్నారని తెలుస్తోంది. కెనడా, అమెరికా, బ్రిటన్, దుబాయ్, పాకిస్తాన్ దేశాల్లో ఖలిస్థానీ ఉగ్రవాదులు ఉన్నారని ఎన్ఐఏ పేర్కొంది. వీరందరి ఆస్తులను బయటకు తీసేందుకు ఎన్ఐఏ కసరత్తులు చేస్తోంది.