Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభల్ ప్రతాప్ సింగ్,చందర్ భాన్‌లను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. జులై 10న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభల్ ప్రతాప్ సింగ్ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి అనుచిత పదజాలంతో మాట్లాడాడు. అంతేకాకుండా కోర్టు హాల్లో కాగితాలు విసిరి గందరగోళం సృష్టించాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిని తోసివేస్తూ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అతడితో పాటు ఉన్న రెండో నిందితుడు చందర్ భాన్‌ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన న్యాయశాస్త్ర విద్యార్థులని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఘటనపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టబొం: సుప్రీంకోర్టు
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఘటనకు కారణమైన విద్యార్థి తీవ్ర మానసిక ఆవేదన, నిరాశలో ఉండటంతోనే అలా ప్రవర్తించినట్లు భావిస్తున్నామని, అతడిపై తమకు సానుభూతి మాత్రమే ఉందని కోర్టు పేర్కొంది.
ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, ఈ ఘటనను అనవసరంగా పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నారు.
కొన్నిసార్లు యువత భావోద్వేగాలకు లోనై ఇలాంటి చర్యలకు పాల్పడుతారని పేర్కొన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన సంస్థల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.