Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో విషాదం.. నాలుగు రోజుల్లో 200కు పైగా చిలుకలు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున 200కు పైగా చిలుకలు మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. బడ్వాహ్ ప్రాంతంలో ఉన్న ఆక్విడక్ట్ బ్రిడ్జి సమీపంలో గత నాలుగు రోజులుగా ఈ మరణాలు నమోదయ్యాయి. డిసెంబరు 29న నావ్‌ఘాట్ ఖేడీ వద్ద ఉన్న ఆక్విడక్ట్ బ్రిడ్జి కింద మొదటగా సుమారు 25 చిలుకలు మృతిచెందినట్లు గుర్తించామని జిల్లా వైల్డ్‌లైఫ్ వార్డెన్ టోనీ శర్మ తెలిపారు. ఆ తర్వాత సంఖ్య క్రమంగా పెరిగి మంగళవారం నాటికి 200ను దాటిందన్నారు. చిలుకలతో పాటు పిచ్చుకలు, పావురాలు, గువ్వలు కూడా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
పక్షుల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదు.. ఫుడ్ పాయిజనింగ్ అనుమానం
మృతిచెందిన పక్షులపై వెటర్నరీ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్పష్టమైంది. పోస్ట్‌మార్టం నివేదికల ప్రకారం చిలుకలు ఫుడ్ పాయిజనింగ్'కు గురైనట్లు తేలింది. వెటర్నరీ ఎక్స్‌టెన్షన్ అధికారి డాక్టర్ సురేశ్ బాఘెల్ మాట్లాడుతూ, చిలుకల కడుపులో అన్నం, చిన్న రాళ్లు లభించాయని తెలిపారు. బ్రిడ్జి వద్దకు వచ్చే సందర్శకులు వండిన ఆహారం లేదా మిగిలిపోయిన భోజనాన్ని తెలియక పక్షులకు వేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
వివరాలు
రంగంలోకి పర్యవేక్షణ బృందాలు.. పక్షులకు ఆహారం వేయడంపై నిషేధం
ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో గత నాలుగు రోజులుగా వెటర్నరీ, అటవీ శాఖల బృందాలు ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఆక్విడక్ట్ బ్రిడ్జి సమీపంలో పక్షులకు ఆహారం వేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అటవీ శాఖ సిబ్బందిని అక్కడ మోహరించారు. పంట పొలాల్లో పిచికారీ చేసిన పురుగుమందులు, నది నీటిలో కలిసే రసాయనాల ప్రభావం కూడా పక్షుల మృతికి కారణమై ఉండొచ్చని డాక్టర్ బాఘెల్ తెలిపారు. మృతిచెందిన పక్షుల విసెరా నమూనాలను మరింత పరీక్షల కోసం జబల్‌పూర్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.