71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లోనే.. 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి
చూపు తిప్పుకోనివ్వకుండా చేసే అందాల తారలు, అందగత్తెలు, అంతర్జాతీయ స్థాయి మోడల్స్ లాంటి వాళ్లంతా 2023లో భారత్ కు క్యూ కట్టనున్నారు. అదేంటి అనుకుంటున్నారా. ఈసారి ప్రపంచ సుందరాంగిని నిర్ణయించే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేది మనదేశంలోనే మరి. ప్రపంచ వ్యాప్తంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు మాములు క్రేజ్ ఉండదు. ఈ పోటీల ద్వారానే ప్రపంచంలోని గొప్ప అందగత్తెలను ఎన్నుకుంటారు. అయితే సాధారణంగా అన్ని దేశాలకు ఈ పోటీలను నిర్వహించే అవకాశం దక్కదు. అలాంటిది ఈసారి ఆ అవకాశం భారత్ కు వచ్చింది. అంటే 2023 మిస్ వరల్డ్ పోటీలు మనదేశంలోనే జరుగుతాయి. 1996లో భారత్ లో అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలను నిర్వహించారు.
2023 ప్రపంచ అందగత్తెను నిర్ణయించే వేదిక భారత్ : జూలియా మోర్లీ
71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలోనే జరుగుతాయన్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ, ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భారత్ లో దాగున్న సంస్కృతి, సాంప్రదాయాలను, సుందరమైన ప్రదేశాలను ప్రపంచంతో పంచుకోనున్నట్లు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అందాల జగజ్జేతలుగా నిలిచిన భారతీయులు వీరే : 1. రీటా ఫరియా - 1966 2. ఐశ్వర్యా రాయ్ - 1994 3. డయానా హేడెన్ - 1997 4. యుక్తా ముఖి - 1999 5. ప్రియాంకా చోప్రా - 2000 6. మానుషి చిల్లార్ - 2017 2017 తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ గా గెలవలేకపోవడం గమనార్హం.