Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో శనివారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి నవ భారత ప్రయాణం ప్రారంభమైనట్ల పేర్కొన్నారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమన్నారు. అలా ఊహించిన వారికి భారతదేశం గురించి తెలియదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం లేకుండా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సాధ్యమయ్యేది కాదన్నారు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో అయోధ్య రామమందిర ఉద్యమాన్ని చూస్తూనే ఉందన్నారు. చివరికి ప్రధాని మోదీ హయాంలో ఈ చిరకాల కల నెరవేరినట్లు చెప్పారు.
జనవరి 22 చారిత్రక దినం: అమిత్ షా
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధించిన అనేక విజయాలను అమిత్ షా లోక్‌సభలో ప్రస్తావించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. జనవరి 22వ తేదీని దేశానికి ముఖ్యమైన రోజుగా అభివర్ణించిన షా.. ఇదొక చరిత్రాత్మక దినంగా నిలిచిందని అన్నారు. జనవరి 22 కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష, సాఫల్య దినమని అమిత్ షా అన్నారు. రామజన్మ భూమి ఉద్యమం ఊపందుకోకముందే, 1990లోనే దేశ ప్రజలకు బీజేపీ హమీ ఇచ్చిందన్నారు. ఆ హామీ మేరకు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినట్లు చెప్పారు. రామమందిర నిర్మాణాన్ని మతంతో ముడిపెట్టరాదని, ఇది దేశ చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసే ఉద్యమమని బీజేపీ పాలమూరు కార్యవర్గంలో తీర్మానం చేసిందన్నారు.