#NewsBytesExplainer: 22 నెలలైనా ఆటో యాప్ కోసం పడని అడుగు.. సంక్షేమబోర్డు ఏర్పాటునూ మరిచిన వైనం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు గడిచినా, ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక యాప్ విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించలేదు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన ఈ హామీ కూడా ఇతర హామీల మాదిరిగానే అమలుకి నోచుకోలేదు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం తగ్గిపోవడంతో వారి కుటుంబాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాహన రుణాల కిస్తీలు చెల్లించలేక అనేక మంది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. కొందరు డ్రైవర్లు తీవ్ర మనస్థాపంతో ప్రాణాలు కూడా తీసుకున్నారు.
వివరాలు
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో తనువులు
2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 37 మంది, మెదక్‌లో 27, వరంగల్‌లో 19, ఖమ్మంలో 16, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చెరో 15 మంది, నిజామాబాద్‌లో 11,మహబూబ్‌నగర్‌లో 8,నల్లగొండలో 7, రంగారెడ్డి జిల్లాలో 6 మంది డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ పరిస్థితుల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి టీహబ్ సహకారంతో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తామని చెప్పి, 22 నెలలు గడిచినా ఆ ప్రాజెక్టు ఇప్పటికీ రూపుదిద్దుకోలేదు.
వివరాలు
నెరవేరని హామీలు
ఇది ప్రభుత్వానికి ఆటోడ్రైవర్ల సమస్యలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతున్నది. ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతామని కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పింది. మ్యానిఫెస్టోలో కూడా పలు ముఖ్యమైన హామీలను ప్రకటించింది. వాటిలో.. ప్రతి ఆటోడ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సాయం, రవాణా వాహనాల ఫిట్‌నెస్ చలానాల వార్షిక సమీక్ష, ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి పట్టణంలో ఆటోనగర్‌ల స్థాపన వంటి అంశాలు ఉన్నాయి. అలాగే పెండింగ్ ట్రాఫిక్ చలానాలను 50శాతం రాయితీతో పరిష్కరిస్తామని కూడా స్పష్టంగా చెప్పింది. మ్యానిఫెస్టో తనకు పవిత్ర గ్రంథంతో సమానమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం డ్రైవర్లలో ఆవేదన కలిగిస్తోంది.
వివరాలు
ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలి
ప్రభుత్వ సహాయం లేకపోవడంతో వారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. టీహబ్ సహకారంతో ప్రత్యేక యాప్ రూపొందిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలి. డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.12 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం 20 వేల కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలి.
వివరాలు
ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలి
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లింపులు ప్రభుత్వమే చేపట్టాలి. ప్రమాద బీమా పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచి సాధారణ మరణాలకూ వర్తింపజేయాలి. అలాగే 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని, పట్టణాల్లో ఆటో పార్కింగ్ స్థలాలు కేటాయించాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు.