Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆయా సంస్థలు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పరిశ్రమలు 'మెగా ప్రాజెక్టు' హోదా కింద రాయితీలను కోరుతున్నాయి. వీటి ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు రప్పించడానికి, పారిశ్రామిక రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమలు, కొత్త ప్రాజెక్ట్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తాయి.
పరిశ్రమలు ఏర్పాటయ్యే జిల్లాలు ఇవే
1) ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మూతబడిన కాగితం మిల్లు స్థానంలో 2.50 లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్‌బోర్డు మిల్లు ఏర్పాటు ప్రతిపాదన. 2) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీలో 75 ఎకరాల్లో 4 గిగావాట్ల పీవీ టాప్‌కాన్ సెల్, సోలార్ పీవీ పరిశ్రమ. 3) మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి ఎనర్జీ పార్క్‌లో క్రిటికల్ మెటీరియల్స్ రీసైక్లింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమ. 4) సిద్దిపేట జిల్లా వర్గల్‌లో మయోరా ఇండియా ప్రైవేటు లిమిటెడ్ చాక్లెట్లు, బిస్కట్ల తయారీ కేంద్రం. మరోవైపు ఐటీసీ కంపెనీ కమలాపురం వద్ద పరిశ్రమ కోసం 1.25 లక్షల ఎకరాల్లో మొక్కల పెంపకానికి అనుమతి కోరింది.