Women Seats in Lok Sabha: లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వ్.. కేంద్రం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గురువారం పార్లమెంట్‌లో మూడు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026తో పాటు డిలిమిటేషన్ బిల్లు-2026ను సభ ముందు ఉంచుతూ చర్చకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిలిమిటేషన్ కారణంగా ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గవని స్పష్టం చేశారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2026 తర్వాత జనగణన ఆధారంగా అమలు చేస్తామని తెలిపారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచి మొత్తం 815 సీట్లకు తీసుకెళ్తామని, అందులో 272 సీట్లు మహిళలకు కేటాయిస్తామని వెల్లడించారు.
వివరాలు
చర్చకు 12 గంటల సమయం
ఇది మొత్తం సభలో మూడో వంతు అవుతుందని చెప్పారు. ఏ రాష్ట్రానికీ నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. ఇక ఈ మూడు బిల్లులపై లోక్‌సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. చర్చకు 12 గంటల సమయం కేటాయించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం లోక్‌సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850 వరకు పెంచే ప్రతిపాదన ఉంది. 2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్ చేసి 2029 ఎన్నికల ముందే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా అదే జనగణన ఆధారంగా జరగనుంది.
వివరాలు
ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం
అయితే ఈ డిలిమిటేషన్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి M. K. Stalin దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని ప్రమాదకర ప్లాన్‌గా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్‌తో అనుసంధానం చేయడం సమస్యాత్మకమని వ్యాఖ్యానించారు.