Loading...
Indian Nationals: అమెరికాకు వెళ్తుండగా ముగ్గురు భారతీయులు అదృశ్యం.. కిడ్నాప్ చేశామంటూ కాల్..
అమెరికాకు వెళ్తుండగా ముగ్గురు భారతీయులు అదృశ్యం.. కిడ్నాప్ చేశామంటూ కాల్..

Indian Nationals: అమెరికాకు వెళ్తుండగా ముగ్గురు భారతీయులు అదృశ్యం.. కిడ్నాప్ చేశామంటూ కాల్..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ముగ్గురు భారతీయుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది. గుజరాత్‌కు చెందిన ఆ ముగ్గురిని కిడ్నాప్ చేశామని, వారిని విడిచిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలంటూ ఇథియోపియా నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చినట్లు సమాచారం. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. తమవారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన మమతా చద్వా, రుత్విక్ జన్సారీ, మయూరీ సోలంకీలు అమెరికా చేరుకునేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయించే నెట్‌వర్క్‌ను సంప్రదించారు.

వివరాలు 

ఒక్కొక్కరికి రూ.75 లక్షల చొప్పున చెల్లించేందుకు డీల్

ఈ నెట్‌వర్క్‌కు చెందిన అల్పేశ్ పంచల్, భార్గవ్ పటేల్‌తో వారు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.75 లక్షల చొప్పున చెల్లించేందుకు డీల్ కుదిరింది.

మమత భర్త గత మూడేళ్లుగా విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నారు.

ఆయన వద్దకు వెళ్లేందుకు మమత గతంలో వీసా కోసం ప్రయత్నించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది.

దీంతో ఆమె అమెరికా చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సెప్టెంబర్ 20న ముగ్గురూ రాజస్థాన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అబుధాబికి వెళ్లేందుకు ఇతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించారు.

అనంతరం ఇథియోపియాకు చేరుకున్నారు. నెల రోజుల కాలపరిమితి ఉన్న వీసాతో అక్కడే బస చేసినట్లు సమాచారం.

వివరాలు 

ఫోన్లు స్విచ్ఛాఫ్

సెప్టెంబర్ 22న మమత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.

తాము కెనడాకు చేరుకున్నామని ఆమె కుటుంబానికి చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత కొంతకాలానికే మమతతో పాటు రుత్విక్, మయూరీల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.

ముగ్గురినీ కిడ్నాప్ చేశామని, వారిని విడుదల చేయాలంటే రూ.కోటి చెల్లించాలని ఆ వ్యక్తి డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది.

ADVERTISEMENT

వివరాలు 

కిడ్నాపర్లకు రూ.60 లక్షలు

ఇప్పటికే విదేశాలకు పంపిస్తామన్న ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించిన కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో మరో కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మమత తండ్రి ప్రభుత్వాన్ని ఆశ్రయించి, తమ కుమార్తెతో పాటు మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడాలని కోరారు.

ఇప్పటికే కిడ్నాపర్లకు రూ.60 లక్షలు చెల్లించినట్లు ఏజెంట్ అల్పేశ్ పంచల్ తెలిపాడు.

అయినప్పటికీ వారు మరో కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ముగ్గురు భారతీయులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వారిని నిజంగానే కిడ్నాప్ చేశారా? ఈ ఘటన వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT