టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్.. 99కి పెరిగిన లిస్ట్
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ మేరకు సిట్ బుధవారం ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులు ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో కలిపి మొత్తం పేపర్ లీకేజీ కేసులో 99 మంది నిందితులు అరెస్టయ్యారు. ప్రశ్నపత్రాల లీకేజీలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ప్రవీణ్‌కు సహకరించినట్లు దర్యాప్తులో అధికారులు కనిపెట్టారు. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే సప్లిమెంటరీ చార్జీషీట్ ను సిట్(SIT) దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
లీకేజీ కేసులో A2 రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సదరు రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ ఇప్పటికే 3 సార్లు తిరస్కరణకు గురికావడం గమనార్హం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలక నిందితులుగా కొనసాగుతున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో టీఎస్పీఎస్సీ పేపర్లు లీకైన విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. దీంతో కమిషన్ పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆయా పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది.