Andhra Pradesh: ముంబై నటి కేసులో.. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కాదంబరీ జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. సర్వీసు వ్యవహారాలకు సంబంధించి జీఏడీ ఈ ఉత్తర్వులను విడుదల చేసింది, గోప్యమైన జీఓ నంబర్లు 1590, 1591, 1592లను ఉంచింది.
ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. సూచనల మేరకు ముంబైకి వెళ్లి అరెస్టులు
కాదంబరీ జత్వానీ అక్రమ అరెస్టులో ముగ్గురు ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం వివరించింది. విశాల్ గున్ని విజయవాడ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్న సమయంలో జత్వానీ అరెస్టుకు ముందు సరైన విచారణ జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులతో చర్చించి,ఆయన సూచనల మేరకు ముంబైకి వెళ్లి అరెస్టులు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఫిబ్రవరి 2న ఉదయం 6:30 గంటలకు నమోదు అయినప్పటికీ,విశాల్ గున్ని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ముంబైకి వెళ్లారు. ఇది కేసు నమోదు కాకముందే పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేస్తోంది. ఆయన తన అధికారాన్ని వాడుకుని, అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపోవద్దని..ఆదేశాలు
అదే సమయంలో,కేసు దర్యాప్తును సక్రమంగా పర్యవేక్షించడంలో విజయవాడ సీపీ కాంతిరాణా విఫలమయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు సూచనలు ఇచ్చారనే కారణంతో పీఎస్‌ఆర్ ఆంజనేయులపై కూడా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో ఇరికించి,అరెస్టు చేయడంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా,డీసీపీ విశాల్ గున్ని ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడించారు. ఈకేసులో వీరు సాక్షులను ప్రభావితం చేయగలగడం,ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు ముంబైకి వెళ్లడంలో కూడా ఈఅంశం ఉన్నట్లు తెలుస్తోంది.డీజీపీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల అనుమతి లేకుండా వీరు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపోవద్దని ఆదేశించారు.