Loading...
Andhra Pradesh: ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు
ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు

Andhra Pradesh: ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరప్రాంతంలో 31.95 శాతం భాగం సముద్ర కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అలాగే రాష్ట్ర తీరంలో 23.86 శాతం ప్రాంతం ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉండగా, మరో 44.20 శాతం ప్రాంతం సముద్రం వైపు ముందుకు విస్తరించినట్లు తెలిపారు. బుధవారం లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను మంత్రి వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే కాకినాడ జిల్లాలో అత్యధికంగా 52.99 శాతం తీరప్రాంతం కోతకు గురైంది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 52.54 శాతం మేర తీర కోత నమోదైనట్లు కేంద్రం తెలిపింది.

వివరాలు 

ఏపీ నుంచి 116 కిసాన్ రైళ్లు

ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో తీరప్రాంతం సముద్రం వైపు విస్తరించినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు.

బాపట్ల జిల్లాలో 75.30 శాతం, కోనసీమ జిల్లాలో 60.19 శాతం,అనకాపల్లి జిల్లాలో 57.81 శాతం, విజయనగరం జిల్లాలో 57.18శాతం మేర తీరప్రాంతం ముందుకు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మొత్తం 116 కిసాన్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు సేవలందించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారం ఇచ్చారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్‌పీటీకు అరటిపళ్ల రవాణా అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,కంటెయినర్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు.

వివరాలు . 

పీఎం కుసుమ్ పథకం అమల్లో పురోగతి లేదు

ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కుసుమ్ పథకంలోని 'సి' కాంపోనెంట్‌ కింద ఫీడర్ స్థాయి సౌర విద్యుదీకరణ కోసం మొత్తం 2,93,587 పంపులకు ఆమోదం ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలులో ఎలాంటి పురోగతి కనిపించలేదని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ తెలిపారు.

లోక్‌సభలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

పథకానికి అనుమతులు లభించినప్పటికీ, అమలు దశలో మాత్రం ఇప్పటివరకు గణనీయమైన ముందడుగు పడలేదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT