UGC Fake Universities List 2026: దేశవ్యాప్తంగా 32 నకిలీ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని, డిగ్రీలు ప్రదానం చేసే చట్టబద్ధమైన అధికారం లేని 32 విద్యాసంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించింది. ఈ మేరకు నవంబర్ 17న ప్రకటన విడుదల చేసింది. ఆయా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకునే ముందు వాటికి గుర్తింపు ఉందా? చట్టబద్ధంగా డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఉందా? అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.
వివరాలు
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 32 సంస్థలు
2026 ఫిబ్రవరిలో నవీకరించిన యూజీసీ జాబితా ప్రకారం.. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 32 నకిలీ విద్యాసంస్థలున్నాయి.
2023 మార్చిలో విడుదల చేసిన జాబితాలో ఈ సంఖ్య 20గా ఉండగా, తాజాగా 32కు పెరిగింది.
గతంలో గుర్తించిన 20 సంస్థల్లో 18 ఇప్పటికీ జాబితాలో కొనసాగుతున్నాయి. అంటే పాత జాబితాలోని 90 శాతం సంస్థలు తాజా జాబితాలోనూ ఉన్నాయి.
వివరాలు
ఢిల్లీలోనే అత్యధిక నకిలీ యూనివర్సిటీలు
నకిలీ యూనివర్సిటీల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.
గతంలో అక్కడ ఎనిమిది నకిలీ విద్యాసంస్థలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12కు చేరింది.
పాత జాబితాలోని ఎనిమిది సంస్థలూ కొనసాగుతుండగా, కొత్తగా మరో నాలుగు చేరాయి. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు విద్యాసంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించారు.
వివరాలు
సుప్రీంకోర్టు ఆదేశాలతో యూజీసీ ప్రకటన
అనుమతులు లేని విద్యాసంస్థల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని 2026 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు యూజీసీని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే కమిషన్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఒక విద్యాసంస్థ చట్టబద్ధంగా ఏర్పాటైందా? డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఉందా? అవసరమైన అనుమతులు పొందిందా? అనే అంశాలను ముందుగానే పరిశీలించాలని సూచించింది.
కేవలం ప్రకటనలు, వెబ్‌సైట్లు, బ్రోచర్లు, సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారాన్ని చూసి విద్యాసంస్థల గుర్తింపుపై నిర్ణయానికి రావద్దని స్పష్టం చేసింది.
వివరాలు
చర్యలు తీసుకుంటున్నా జాబితాలో కొనసాగుతున్న సంస్థలు
నకిలీ యూనివర్సిటీల జాబితాలో కొన్ని విద్యాసంస్థలు ఏళ్ల తరబడి కొనసాగుతుండటం.. వాటిపై తీసుకుంటున్న చర్యల ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అయితే ఒక సంస్థ పేరు జాబితాలో కొనసాగుతున్నంత మాత్రాన అది ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోందని లేదా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని భావించకూడదని యూజీసీ స్పష్టం చేసింది.
ఆగస్టు 5న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో విద్యాశాఖ ఈ విషయాలను వెల్లడించింది. నకిలీ విద్యాసంస్థలకు వివరణ కోరుతూ లేఖలు పంపినట్లు, నిబంధనల అమలుకు సంబంధించిన నోటీసులు, షోకాజ్ నోటీసులు, హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
అంతేకాకుండా, కొన్ని సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొంది. ఆయా సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరినట్లు వివరించింది.
వివరాలు
నకిలీ సర్టిఫికెట్లతో జాతీయ భద్రతకూ ముప్పు
నకిలీ విద్యాసర్టిఫికెట్ల వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తుకే పరిమితం కాదని, జాతీయ భద్రతపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ మిలో వ్యవస్థాపకుడు, సీఈవో కరణ్ భట్టి అభిప్రాయపడ్డారు.
పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారాల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు.