Charla: గోదావరి ఉద్ధృతి.. వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీల్లో మొత్తం 38 మంది వరద ముప్పులో చిక్కుకున్నారు. వీరిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు ఉండగా, మరో ఎనిమిది మంది స్థానికులు ఉన్నట్లు సమాచారం. గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో వరదనీరు వేగంగా ఇసుకపాయల్లోకి చేరింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన కొందరు లారీ డ్రైవర్లు తమ వాహనాలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోగలిగారు. అయితే మిగిలిన డ్రైవర్లు, స్థానికులు వరద నీటితో చుట్టుముట్టబడటంతో అక్కడే చిక్కుకుపోయారు.
వివరాలు
చర్ల-ములుగు జిల్లా వెంకటాపురం మధ్య నిలిచిపోయిన రాకపోకలు
చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్థానికులు పడవల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించారు.
సమాచారం అందుకున్న వెంటనే చర్ల సీఐ రాజవర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద ప్రవాహం మరింత ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో చర్ల-ములుగు జిల్లా వెంకటాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్న అధికారులు భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.