Telangana: తెలంగాణలో 6 నెలల్లో 4 లక్షల మంది ఈపీఎఫ్ పరిధిలోకి.. అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఆరునెలల వ్యవధిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 4 లక్షల మంది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చారని తెలంగాణ అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై)లో రాష్ట్రంలోని 24,611 సంస్థలు నమోదు చేసుకున్నాయని చెప్పారు. వీటి ద్వారా కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన యువత 2.73 లక్షల మంది ఉండగా, గతంలో ఉద్యోగం వదిలి ఇప్పుడు మళ్లీ కార్మిక బలగంలో చేరిన వేతనజీవులు 1.27 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించారు. జీవన్ ప్రమాణ్ సేవలు, పీఎఫ్ క్లెయిమ్‌లు, పింఛనుదారుల సేవలు, ఉద్యోగుల నమోదు ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై ఆయన 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
వివరాలు
45 లక్షల పీఎఫ్ క్లెయిమ్‌లు పరిష్కారం
కార్మిక కోడ్‌లు గతేడాది నవంబరులో అమల్లోకి వచ్చాయని సత్యనారాయణ తెలిపారు. గతంలో చాలా సంస్థలు అలవెన్సులను ఎక్కువగా చూపించి, మూలవేతనం,డీఏను తక్కువగా చూపించడం వల్ల ఈపీఎఫ్ చెల్లింపులు కూడా తక్కువగా ఉండేవని చెప్పారు. కొత్త వేతన కోడ్ ప్రకారం వేతనంలో అలవెన్సులు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా యాజమాన్యాలు వేతన నిర్మాణాన్ని సవరించి ఈపీఎఫ్ చందాలు చెల్లించాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు తెలిపారు. మరణ క్లెయిమ్‌లను గరిష్ఠంగా వారం రోజుల్లో పూర్తి చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు పీఎఫ్, ఈడీఎల్‌ఐ సొమ్మును మూడు రోజుల్లోనే చెల్లిస్తున్నామని చెప్పారు.
వివరాలు
ఇంటివద్దకే జీవన్ ప్రమాణ్ సేవలు
ఉద్యోగుల వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు సరిచేసుకునేందుకు సరళీకరించిన జాయింట్ డిక్లరేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పరిష్కార ప్రక్రియను ఎకౌంట్స్ అధికారి, ఏపీఎఫ్‌వో పరిధిలోనే పూర్తి చేసేలా అధికారాలు కల్పించినట్లు తెలిపారు. పింఛనుదారులు ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాణ్ సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీనికోసం అన్ని మొబైల్ ఫోన్లలో పనిచేసేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా జీవన్ ప్రమాణ్ ఇవ్వొచ్చని వివరించారు. యాప్ లేదా మీసేవ ద్వారా జీవన్ ప్రమాణ్ సమర్పించలేని వారికి ఇంటి వద్దే ఈ సేవ అందించేందుకు పోస్టల్ పేమెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పింఛనుదారులు 033-22029000 నంబరుకు కాల్ చేస్తే ఇంటికే వచ్చి సేవలు అందిస్తారని చెప్పారు.
వివరాలు
ఆటోమేషన్‌తో పీఎఫ్ అడ్వాన్సులు
ఇందుకు అయ్యే ఖర్చును ఈపీఎఫ్‌వోనే భరిస్తుందని వెల్లడించారు. పీఎఫ్ అడ్వాన్సు క్లెయిమ్‌లను ఆటోమేషన్ విధానంలో పరిష్కరిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. రూ.5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్‌లను మానవ ప్రమేయం లేకుండానే మూడు రోజుల్లో పరిష్కరించి, నేరుగా చందాదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని చెప్పారు. ఇందులో 80 శాతం అడ్వాన్సు క్లెయిమ్‌లు అనారోగ్యం పేరుతోనే వస్తున్నాయని వెల్లడించారు.
వివరాలు
పీఎంవీబీఆర్‌వై కింద ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు
దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పీఎంవీబీఆర్‌వై పథకాన్ని 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం 2027 జులై 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ఏడాదికి మొత్తం రూ.15 వేల ప్రోత్సాహకం లభిస్తుంది. తొలి ఆరు నెలల సర్వీసు పూర్తి అయిన తర్వాత రూ.7,500, మరో ఆరు నెలల తర్వాత మరో రూ.7,500 నేరుగా ఉద్యోగి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు.
వివరాలు
ఈఈసీతో ఈపీఎఫ్ అమలు అవకాశం
సాధారణ రంగాల్లో ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు రెండేళ్ల పాటు, తయారీ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే యాజమాన్యాలకు నాలుగేళ్ల పాటు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పారు. వేతనం రూ.10 వేల లోపు ఉంటే నెలకు రూ.1,000, రూ.10,001 నుంచి రూ.20 వేల లోపు ఉంటే రూ.2,000, రూ.20 వేల నుంచి రూ.లక్షలోపు ఉంటే నెలకు రూ.3,000 యాజమాని ఖాతాలో జమ అవుతుందని వివరించారు. 2017 జులై నుంచి 2025 అక్టోబరు వరకు ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు ఈపీఎఫ్ అమలు చేయకపోతే, వారిని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉద్యోగుల నమోదు ప్రచార కార్యక్రమం (ఈఈసీ) ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని తెలిపారు.
వివరాలు
25,045 మందికి పీపీవోలు
ఈ క్రమంలో యాజమాన్యాలు తమ వంతు వాటాను వడ్డీతో కలిసి చెల్లించి, రూ.100 జరిమానాతో ఉద్యోగులకు ఈపీఎఫ్ పథకాన్ని అమలు చేయవచ్చని చెప్పారు. అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారం, డిమాండ్ నోటీసుల జారీ విషయంలో తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాలపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో అర్హత సాధించిన 80,261 మందికి డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వీరిలో 46,244 మంది ఈపీఎస్ బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఇప్పటివరకు 25,045 మందికి పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవోలు) జారీ చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తుల పరిష్కారంలో మెరుగైన పనితీరుకు కేంద్ర స్థాయి అవార్డులు లభించాయని తెలిపారు.
వివరాలు
పదవీవిరమణ రోజునే పీపీవో లక్ష్యం
అవసరమైన పత్రాలు సరిగా లేని కారణంగా కొందరి దరఖాస్తులను యాజమాన్యాలకు తిరిగి పంపినట్లు చెప్పారు. ప్రయాస్ పథకం కింద ఉద్యోగి పదవీవిరమణ చేసే రోజునే పీపీవో జారీ చేసి, పీఎఫ్ చెల్లింపులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అయితే ఇందుకోసం పదవీవిరమణకు చేరువలో ఉన్న ఉద్యోగులను యాజమాన్యాలు ముందుగానే గుర్తించి, అవసరమైన క్లెయిమ్‌లను ముందస్తుగా దాఖలు చేయాలని సూచించారు. అలా చేస్తే పదవీవిరమణ రోజునే నగదు వారి చేతికి అందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,409 మందికి పదవీవిరమణ రోజునే పీపీవోలు జారీ చేసినట్లు సత్యనారాయణ వెల్లడించారు.