LOADING...
Telangana: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 320 డ్రోన్ల పంపిణీ..  
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 320 డ్రోన్ల పంపిణీ..

Telangana: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 320 డ్రోన్ల పంపిణీ..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని నిర్ణయించింది. మొదటి విడతలో ప్రతి జిల్లాకు పది చొప్పున డ్రోన్లు కేటాయించనున్నారు. జిల్లాల వారీగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా వీటిని అందజేయనున్నారు. డ్రోన్లతో పాటు పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు ఉపయోగించే టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్‌లు, అలాగే ఇతర ఉద్యానవన పంటల కోతకు అవసరమైన పరికరాలను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చారు.

వివరాలు 

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.101 కోట్ల వ్యయం  

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం కల్పిస్తూ గత డిసెంబరు నుంచి రూ.101 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటివరకు రూ.28.74 కోట్ల సబ్సిడీతో 9,936 వ్యవసాయ యంత్రాలను రైతులకు పంపిణీ చేశారు. డ్రోన్లను కూడా ఈ పథకంలో చేర్చాలని రైతుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ అధికారులతో చర్చించి మంత్రి తుమ్మల నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్లతో పాటు పసుపు, పామాయిల్‌కు సంబంధించిన యంత్రాలను కూడా రాయితీపై అందించాలని ఆదేశించారు.

వివరాలు 

సత్వరమే సంఘాల ఎంపిక: మంత్రి తుమ్మల

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 డ్రోన్ల పంపిణీకి సంబంధించి అర్హ సంఘాలను తక్షణమే ఎంపిక చేయాలని మంత్రి సోమవారం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

Advertisement