Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం
డిజిటైజేషన్ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఆవిధంగా ఆహార భద్రతలో ప్రపంచానికి ఒక నూతన ప్రమాణాన్ని స్థాపించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా మొత్తం 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా, ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగించబడినట్లు పేర్కొంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం,ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయింది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాల్లో ఈపోస్ పరికరాలు అమర్చబడ్డాయి. వీటి సహాయంతో 99.8% కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయగా, 98.7% లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయింది. ఈకేవైసీ ప్రక్రియ ద్వారా 64% లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా పూర్తయింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పటిష్ట చర్యలు
ఆహార సరఫరాలో పకడ్బందీగా వ్యవహరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పటిష్ట చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరకు రవాణాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రైల్వేల ద్వారా వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అనుసంధానించామని వివరించింది. అలాగే, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకం ద్వారా లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరకులు పొందగలిగే సౌలభ్యాన్ని పొందారని వివరించింది.