 
                                                                                Chittoor: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు సంబంధించిన కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ నరమేధానికి కారణమని తేలిన ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. 2015 నవంబరు 17న చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే చోటుచేసుకోవడం ఆ సమయంలో తీవ్ర కలకలం రేపింది. దశాబ్దం పాటు సాగిన ఈ విచారణలో చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల నిందితులను దోషులుగా తేల్చి, నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేశారు.
వివరాలు
నిందితులు, తీర్పు వివరాలు
ఈ కేసులో ప్రారంభంలో మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే కేసుతో సంబంధం లేదని వాదించిన కాసరం రమేష్ (ఏ22) పిటిషన్‌పై కోర్టు అతడిని విముక్తి చేసింది. విచారణ మధ్యలో ఎస్.శ్రీనివాసాచారి (ఏ21) మరణించడంతో, మొత్తం 21 మంది నిందితులపై విచారణ కొనసాగింది. విచారణ అనంతరం మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ (ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి (ఏ3),మంజునాథ్ అలియాస్ మంజు (ఏ4),మునిరత్నం వెంకటేష్ (ఏ5) లను దోషులుగా తేల్చింది.
వివరాలు
హత్యకు దారితీసిన కారణాలు
ఈ ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది.అదనంగా, ఏ1 చింటూకు రూ.70 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, అందులో రూ.50లక్షలు కఠారి అనురాధ,మోహన్ వారసులకు, రూ.20 లక్షలు గాయపడిన వేలూరి సతీష్ కుమార్ నాయుడికి అందించాలని స్పష్టం చేసింది. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహన్‌కు చింటూ మేనల్లుడు. వీరి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో మేయర్ అనురాధ పదవి చుట్టూ ఉన్న రాజకీయ ప్రతిష్ఠతో అసూయకు గురైన చింటూ, తన మేనమామ మోహన్‌ను తొలగించాలని పథకం పన్నాడు. 2015 నవంబరు 17న చింటూ,మరో నలుగురు బురఖాలు ధరించి,తుపాకులు,కత్తులతో చిత్తూరు మున్సిపల్ ఆఫీసులోకి ప్రవేశించారు. అనురాధపై చింటూ,అతని సహచరులు కాల్పులు జరపగా, ఆమె అక్కడిక్కడే మరణించారు.
వివరాలు
హత్యాయత్నం,ఇతర వివరాలు
అదే సమయంలో పక్కగదిలో ఉన్న మోహన్‌పై కత్తులతో దాడి చేయగా, ఆయనను తీవ్రమైన గాయాలతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. దంపతులపై దాడి సమయంలో అక్కడ ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడిపై కూడా మంజునాథ్ (ఏ4) హత్యాయత్నం చేశాడు. అందుకే ఈ కేసులో హత్యాయత్నం ఆరోపణ కూడా చేర్చారు. విచారణలో ఆ నేరం కూడా నిరూపించారు. ఇతర 16 మందిపై హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం, ఆర్థిక సాయం చేయడం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిని సాక్ష్యాలతో నిరూపించలేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించారు.
వివరాలు
మొత్తం 352 వాయిదాలు
ఈ కేసు తీర్పు వెలువడటానికి దాదాపు పదేళ్లు పట్టింది, మొత్తం 352 వాయిదాలు పడ్డాయి. విచారణలో 130 మంది సాక్షులను పరిశీలించారు. ఏ3 జయప్రకాష్‌రెడ్డి, ఏ4 మంజునాథ్ అరెస్టు అయినప్పటి నుంచే జైలులో ఉన్నారు. ఇప్పుడు ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో, దోషులకు వైద్య పరీక్షలు పూర్తి చేసి వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.