LOADING...
PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పర్యటన మార్గానికి సమీపంలో జిలెటిన్ కడ్డీలు లభించిన ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ బెంగళూరు సౌత్ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 10న ప్రధాని మోదీ బెంగళూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆయన కార్యక్రమం ప్రారంభానికి సుమారు గంటన్నర ముందు నగర శివారులోని కగ్గలీపుర-తాతగుని ప్రాంతంలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం సమీపంలో అనుమానాస్పద ప్యాకెట్‌ను పోలీసులు గుర్తించారు.

వివరాలు 

ప్యాకెట్‌లో రెండు జిలెటిన్ కడ్డీలు

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రోడ్డు పక్కన గోడ దగ్గర ఆ ప్యాకెట్‌ను చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే యాంటీ-సబోటేజ్ బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. ప్యాకెట్‌లో రెండు జిలెటిన్ కడ్డీలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది. అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బెంగళూరు నగర పోలీసులు, రామనగర పోలీసులు కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గానికి కొంత దూరంలో ఈ పేలుడు పదార్థాలు లభించాయని, వాటిని అక్కడికి ఎవరు తీసుకువచ్చారు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ జరుగుతోందని సెంట్రల్ రేంజ్ డీఐజీ గిరీష్ వెల్లడించారు.

వివరాలు 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ

ఇదిలా ఉండగా ఈ ఘటనపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పర్యటన సమయంలో పేలుడు పదార్థాలు బయటపడటం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో, ముఖ్యంగా బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు.

Advertisement