LOADING...
Jaipur Hospital Fire: రాజస్థాన్‌లోని జైపూర్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు మృతి
ఆరుగురు రోగులు మృతి

Jaipur Hospital Fire: రాజస్థాన్‌లోని జైపూర్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2025
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లోని ట్రామా సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు దుర్మరణం చెందగా, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రామా ఐసీయూలో 11 మంది, సెమీ ఐసీయూలో 13 మంది చికిత్స పొందుతున్నారని ట్రామా సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ అనురాగ్ ధకడ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ఆయన అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఐసీయూ అంతటా, అలాగే రెండో ఫ్లోర్‌ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు భయంతో అల్లాడిపోయారు.

వివరాలు 

రెండు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి..

సిబ్బంది వెంటనే స్పందించి కొందరు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని దాదాపు రెండు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఐసీయూలో ఉన్న పరికరాలు, రక్త నమూనాల ట్యూబులు, పేషెంట్ల చికిత్సకు సంబంధించిన కేస్‌ షీట్లు, ముఖ్యమైన వైద్య పత్రాలు, ఇంకా ఇతర పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఘటన తరువాత ఆసుపత్రి సిబ్బంది భయంతో అక్కడి నుంచి పారిపోయారని, మంటలు చెలరేగినప్పుడు అగ్నిని ఆర్పడానికి అవసరమైన సిలిండర్లు లేదా ఎలాంటి అత్యవసర పరికరాలు అక్కడ లేవని రోగుల బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషాద ఘటనతో జైపూర్ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైపూర్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం