Hiv Cases: బీహార్‌లోని సీతామర్హిలో 7,400 హెచ్‌ఐవి కేసులు.. 400కు పైగా చిన్నారులకు తల్లిదండ్రుల నుంచి వైరస్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఆర్‌టీ విభాగం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు ఆ జిల్లాలో 7,400 మందికి పైగా వ్యక్తులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 400 మందికిపైగా చిన్నపిల్లలు ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. వైద్యుల పరిశీలన ప్రకారం, ఈ చిన్నారులకు వైరస్ ప్రధానంగా వారి తల్లిదండ్రుల నుంచే సంక్రమించింది. తల్లి, తండ్రి లేదా ఇద్దరిలో ఎవరికైనా హెచ్ఐవీ ఉండటం వల్ల ప్రసవ సమయంలోనే పిల్లలకు ఈ వైరస్ చేరినట్లు వైద్యులు చెబుతున్నారు.
వివరాలు
ఏఆర్‌టీ కేంద్రంలోనే ప్రతి నెలా 40 నుండి 60 కొత్త ఎయిడ్స్ కేసులు
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, స్థానిక అధికారులు అప్రమత్తమై పలు చర్యలు ప్రారంభించారు. సీతామఢీ జిల్లాలోని ఏకైక ఏఆర్‌టీ కేంద్రంలోనే ప్రతి నెలా 40 నుండి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. హెచ్ఐవీ విస్తారంగా పెరగడానికి పలు సామాజిక, అవగాహనా లోపాలు కారణమని వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ప్రజల్లో ఇంకా హెచ్‌ఐవీ వ్యాప్తి విధానం, జాగ్రత్తలు, పరీక్షల అవసరం పై స్పష్టమైన అవగాహన లేనట్లు వారు పేర్కొన్నారు. తరచూ ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని కూడా తెలిపారు.
వివరాలు
ఏఆర్‌టీ కేంద్రం దాదాపు 5,000 మంది రోగులకు చికిత్స
సీతామఢీలో హెచ్‌ఐవీ ప్రమాదం పెరగడానికి ప్రధాన కారణాల్లో.. రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకోకుండా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం, సమాజంలో ఉన్న వివక్షత కారణంగా పరీక్షలకు ముందుకొరాని పరిస్థితి.. ముఖ్యమైనవిగా వైద్యులు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల జిల్లాలో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని వారు తెలిపారు. సెంటర్ అధికారుల ప్రకారం, ప్రస్తుతం ఏఆర్‌టీ కేంద్రం దాదాపు 5,000 మంది రోగులకు చికిత్స, మందుల పంపిణీ చేపడుతోంది. సీతామఢీ ఇప్పుడు హెచ్‌ఐవీ కేసులు అత్యధికంగా నమోదయ్యే జిల్లాల్లో ఒకటిగా మారిందని డాక్టర్ హసీన్ అఖ్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
ప్రత్యేక మెడికల్ బృందాలను పంపేందుకు ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో, జిల్లా పరిపాలన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏఆర్‌టీ కేంద్రం ఆధ్వర్యంలో కొత్త కమ్యూనిటీ ఔట్‌రీచ్ కార్యకలాపాలు రెడీ అవుతున్నాయి. గ్రామస్థాయిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక మెడికల్ బృందాలను పంపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సురక్షిత లైంగిక పద్ధతులు పాటించడం, కలుషిత సూదులు వాడకూడదనే అవగాహన కల్పించడం, పర్యాయంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రజల్లో మేల్కొలపడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజారోగ్యంపై విద్యను బలోపేతం చేయకపోతే, రాబోయే నెలల్లో సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.