సాహితీ ఫార్మాలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. నలుగురిని కిమ్స్ ఆస్పత్రికి, మరో ముగ్గురిని కేజీహెచ్ కు తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో కార్మికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ మేరకు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఫార్మా సంస్థలో రియాక్టర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు కంపెనీ లోపలే చిక్కుకుపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తున్నారు
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఫార్మాలో ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అక్కడి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పేలుడు ఘటన కారణంగా సాహితీ ఫార్మా సమీపంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మరోవైపు సాహితీ ఫార్మాలో మంటలను ఆర్పివేస్తున్న క్రమంలో రసాయనాలు ఎగిసిపడి ఇద్దరు ఫైర్ ఫైటర్ సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ రవిసుభాష్, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.