
Telangana: 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న బాలసదనాలు.. శిశువిహార్ పరిస్థితి ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
అసహాయ పరిస్థితుల్లో ఉన్న, అనాథలుగా విడిచిపెట్టిన చిన్నారులను సంరక్షించడం శిశు సంక్షేమశాఖ ముఖ్య బాధ్యత. అయితే, శిశువిహార్, బాలసదనాలు, జిల్లా స్థాయి బాలల సంరక్షణ యూనిట్లలో సిబ్బంది కొరత తీవ్రతరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా శిశువిహార్‌లు, బాలసదనాల్లో మొత్తం 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు శిశుసంక్షేమశాఖ నివేదికలో తేలింది. ఈ ఖాళీల్లో కీలకమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 6 ఏళ్ల లోపు పిల్లల సంరక్షణ కోసం హైదరాబాద్ శిశువిహార్ సహా మొత్తం 17 శిశుగృహాలు పనిచేస్తున్నాయి.
Details
32 మంది వైద్యులు ఉండాలి
ప్రస్తుతం 305 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం 32 మంది వైద్యులు ఉండాలి, కానీ కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. నర్సుల పోస్టుల్లో కూడా సగానికి పైగా ఖాళీలు ఉన్నాయి. శిశువిహార్‌ల్లో మొత్తం 352 పోస్టులకు గాను 82 ఖాళీగా ఉన్నాయి. ఆరేళ్లు దాటిన పిల్లలను బాలసదనాల్లో ఉంచి, వారికి విద్యాబుద్ధులను నేర్పిస్తారు. ఈ కేంద్రాల్లో 18 ఏళ్ల వరకు వారికి శిక్షణ, కెరీర్ అవకాశాలపై శిశువిహార్ శ్రద్ధ చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలసదనాల్లో 882 మంది పిల్లలు ఉన్నారు.
Details
70శాతం పైగానే ఖాళీలు
ప్రభుత్వ మంజూరులో 262 పోస్టులుండగా, కేవలం 77 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇది 70 శాతం పైగానే ఉంది. ఇక జిల్లా స్థాయి బాలల సంరక్షణ యూనిట్లు (డీసీపీయూలు) కూడా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 33 యూనిట్లలో 4 చోట్ల మాత్రమే సరిపడా సిబ్బంది ఉన్నారు. డీసీపీయూల్లో భర్తీ చేయాల్సిన 67 పోస్టుల్లో అధిక శాతం ఖాళీగానే ఉన్నట్టు శిశుసంక్షేమశాఖ తెలిపింది.