Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి
పంజాబ్, హర్యానాలోని శంభు సరిహద్దులో రైతుల నిరసనలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. మృతి చెందిన రైతును 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌గా గుర్తించారు. అతను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసి. గురువారం అర్థరాత్రి అతను తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడే అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
సరిహద్దులో తొలి మరణం
పంజాబ్-హర్యానా సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసనల వేళ.. ఓ రైతు మృతి చెందడం ఇదే తొలిసారి. గుండెపోటుతోనే రైతు జ్ఞాన్ సింగ్ మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. ఇక్కడికి తీసుకొచ్చేసరికి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఉదయం 6 గంటలకు అతను చనిపోయినట్లు చెప్పారు. పాటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్ పర్రే కూడా రైతు మృతిని ధృవీకరించారు. వైద్య రికార్డుల ప్రకారం గుండెపోటుతో రైతు మృతి చెందినట్లు తెలిపారు. కిసాన్ మజ్దూర్ మోర్చాలోని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి సభ్యుడిగా జ్ఞాన్ సింగ్ ఉన్నారు.