Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో వాహనం.. 8మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో బొలెరో కారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. కారులో 10 మంది ఉన్నారు. వీరిలో 8 మంది చనిపోయారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. నైనిటాల్ జిల్లాలోని బేతాల్‌ఘాట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఉంచకోట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది నేపాలీ కూలీలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం ప్రకారం, 7 మంది అక్కడికక్కడే మరణించారు, ఒకరు ఆసుపత్రిలో మరణించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
బేతాల్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి అనిష్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి రాజేంద్ర కుమార్ తన బొలెరోలో నేపాల్ మూలానికి చెందిన 10 మందిని ఉంచకోట్‌లోని మల్లాగావ్ నుండి తనక్‌పూర్ వైపు తీసుకువెళుతున్నాడు. ఇంతలో బొలెరో కారు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలో పడింది. రాత్రి వాహనం పడిపోయిన శబ్దం విన్న వెంటనే సమీపంలోని ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.అప్పటికే గ్రామస్తులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్‌తో పాటు 9 మంది నేపాలీ కూలీలు వాహనంలో రాంనగర్‌కు బయలుదేరారు. ఈ నేపాలీ కూలీలు రాంనగర్ నుంచి నేపాల్ వెళ్లాల్సి వచ్చింది.