Census: రేపటి నుంచి జనగణన తొలి దశ .. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన గృహగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. 1872లో ప్రారంభమైన భారత జనగణన చరిత్రను పరిగణలోకి తీసుకుంటే ఇది మొత్తం 16వది కాగా, స్వతంత్ర భారతదేశంలో ఇది 8వ జనగణనగా నిలుస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే తొలిసారిగా పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో వివరాలను సేకరించడం. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ డేటాను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతోనూ పంచుకోరని, అలాగే సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వబోరని తెలిపారు. కోర్టుల్లో సాక్ష్యాలుగా కూడా ఉపయోగించలేరు.
వివరాలు
రాష్ట్రాల వారీగా ప్రకటించిన తేదీల ప్రకారం గృహగణన ప్రక్రియ
ఈ గృహగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రాల వారీగా ప్రకటించిన తేదీల ప్రకారం జరుగుతుంది. మొదటి దశలో 33 ప్రశ్నల ఆధారంగా ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల వివరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఆస్తులు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజలు చెప్పిన వివరాలను ఎన్యూమరేటర్లు ఎలాంటి మార్పులు లేకుండా నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
వివరాలు
స్వయంగా గృహ వివరాలను నమోదు చేసుకునే అవకాశం
ఈసారి ప్రజలకు స్వయంగా తమ గృహ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. https://se.census.gov.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈమెయిల్ నమోదు చేసిన తర్వాత OTP ద్వారా లాగిన్ అయి ప్రశ్నావళిని పూర్తి చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత "H" అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక ఐడీ లభిస్తుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్‌కు చూపిస్తే సరిపోతుంది. అవసరమైతే వివరాలను తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంటుంది.
వివరాలు
కులం వివరాలు రెండో దశలో సేకరణ
మొదటి దశలో కులగణన ఉండదని స్పష్టం చేశారు. రెండో దశలో మాత్రమే వ్యక్తిగత జనాభా వివరాలతో పాటు కులం, మతం సమాచారాన్ని సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదా తొలగించడం జరగదని తెలిపారు. అలాగే ఎన్యూమరేటర్లు ఎలాంటి పత్రాలు సేకరించరని కూడా చెప్పారు. డేటా భద్రత కోసం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ఉండదని, ప్రస్తుతం జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) అప్‌డేట్ చేయడం లేదని తెలిపారు. పూర్తి జనగణన వివరాలు 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ఇంటి యజమాని మొబైల్ నంబర్ నమోదు
సెల్ఫ్ ఎన్యూమరేషన్ సందర్భంగా వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు పోర్టల్‌లో ప్రత్యేకంగా FAQ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సహజీవనంలో ఉన్నవారిని స్థిరమైన సంబంధంలో ఉంటే వివాహిత జంటగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. అలాగే కులం లేదా తెగ వివరాలు అందుబాటులో లేకపోతే "Others" ఎంపికను ఉపయోగించవచ్చని సూచించారు. ఈ గృహగణనలో ఇంటిలో నివసించే సభ్యుల సంఖ్య, వారి పేర్లు,లింగం,కుటుంబ యజమాని వివరాలు,గదుల సంఖ్య,వివాహిత జంటల సంఖ్య, ఇంటి సౌకర్యాలు,ఆస్తులు, ఆదాయ వనరులు వంటి అంశాలు నమోదు చేస్తారు. అదేవిధంగా టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి సౌకర్యాలు, సైకిల్ నుంచి కారు వరకు వాహనాల వివరాలు కూడా సేకరిస్తారు. జనగణన ప్రక్రియకు అవసరంగా ఇంటి యజమాని మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు.