బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!
బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు. మార్చి 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దాదాపు 600మంది అనుచరుల సమక్షంలో '10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే'గా బాలుడికి పట్టాభిషేకం నిర్వహించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. 'ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే' పదవి అనేది బౌద్ధమతం మూడో అత్యున్నత స్థానం. ఇదివరకు 9మంది 'ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే'గా పనిచేశారు. తాజాగా 10వ మత నాయకుడిని దలైలామా నియమించారు. బౌద్ధమతంలో 'దలైలామా' స్థానం అత్యున్నతమైనది. 'పంచన్ లామా' అనేది రెండో అతిపెద్ద పదవి, ఇక మూడోది 'ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే'గా బౌద్ధులు భావిస్తుంటారు. వీరి ఆదేశాలనే ప్రపంచంలోని బౌద్దమతాన్ని ఆచరించే వారందరూ పాటిస్తుంటారు.
'10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే' నియామకంపై చైనా ఎలా స్పందిస్తుంది?
అగుయిడాయ్, అచిల్తాయ్ అల్తన్నార్ అనే దంపతుల కవల పిల్లలలో ఒక బాలుడినే ఇప్పుడు '10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే'గా నియమించిట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆ చిన్నారి మంగోలియాలో జన్మించి యూఎస్‌లో పెరిగినట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా టిబెటన్ మతగురువును నియమించడంపై చైనా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బౌద్ధ నాయకుడిని నియమించడానికి చైనా ఒప్పుకుంది. ఆ తర్వాత 1995లో దలైలామా 'పంచెన్ లామా'గా ఆరేళ్ల చిన్నారిని నియమించారు. అయితే చైనా అధికారులు ఆ చిన్నారిని అరెస్టు చేసి, అతని స్థానంలో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించారు. అప్పటి నుంచి 'పంచెన్ లామా'గా నియామకమైన ఆ ఆరేళ్ల చిన్నారి, అతని కుటుంబం బయటకి ప్రపంచానికి కనిపించకపోవడం గమనార్హం.