దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.
దలైలామా భద్రతలో కీలకంగా వ్యవహరించిన 'దుకా' అనే ఈ స్నిఫర్ డాగ్ దలైలామా అధికారిక ప్యాలెస్‌లో పెట్రోలింగ్ చేయడానికి, బాంబులను పసిగట్టడానికి పోలీసులు డుకాను ఉపయోగించారు.
ఇది దాదాపు 12ఏళ్ల పాటు సేవలందించినట్లు హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు.
పేలుడు పదార్థాలను గుర్తించడంలో దుకా ప్రత్యేక శిక్షణ పొందినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ చౌహాన్ వెల్లడించారు.
భారతదేశంలో మూడంచెల భద్రతను అనుభవిస్తున్న అత్యంత తక్కువ వ్యక్తుల్లో దలైలామా ఒకరు.
దలైలామా
'దుకా' స్థానంలో టామీ నియామకం
ఏడు నెలల వయస్సులో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ నుంచి 2010లో రూ.1.23 లక్షలకు 'దుకా'ను కొనుగోలు చేసినట్లు పోలీసుల చెప్పారు. 'దుకా' ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత, దలైలామా భద్రత కోసం నియమించారు. దలైలామా భద్రతలో 'దుకా' ఎంతో నిబంద్ధతతో పనిచేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.
ప్రస్తుతం వినికిడి శక్తిని కోల్పోయిన దుకాను, దాని సంరక్షుడు రాజీవ్ కుమార్ వేలంలో నామమాత్రపు ధరకు 20డాలర్ల(రూ.1,550)కు దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పుడు దలైలామాను రక్షించే బాధ్యతను తొమ్మిది నెలల టామీకి అప్పగించారు. టామీ పంజాబ్ హోంగార్డ్స్ కనైన్ ట్రైనింగ్ అండ్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందింది. దీన్ని రూ.3 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు.