Delhi Blast: సంఘటనా స్థలంలో 9mm బుల్లెట్లు కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు వేగాన్ని పెంచాయి. సంఘటనా ప్రాంతంలో మూడు బుల్లెట్లను ఫోరెన్సిక్ టీమ్ స్వాధీనం చేసుకున్నట్టు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇవి సైన్యం సాధారణంగా ఉపయోగించే 9 ఎంఎం కార్ట్రిడ్జ్‌లు అని తెలిపారు. అయితే అక్కడ ఏ విధమైన పిస్టల్ లేదా ఆయుధం మాత్రం దొరకలేదని స్పష్టం చేశారు. పేలుడు జరిగినప్పుడు అక్కడ కర్తవ్యంపై ఉన్న పోలీసు, భద్రతా సిబ్బందికి కేటాయించిన బుల్లెట్లను కూడా అధికారులు చెక్ చేసినట్టు తెలిపారు. అవి వారి వాటికి సంబంధించినవి కాదని ధృవీకరించినట్టు చెప్పారు. భద్రతా బలగాలు ఉపయోగించే బుల్లెట్లు ఆ ప్రాంతంలో ఎలా కనిపించాయన్న అంశంపై ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోంది.
వివరాలు
ఘటనాస్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రకాల నమూనాల సేకరణ
అదే సమయంలో,పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్‌కు దగ్గరలోని సిగ్నల్ వద్ద కారు పేలిన సందర్భంలో, అందులో దాదాపు రెండు కిలోల వరకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించబడిందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించారు. ఘటనాస్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రకాల నమూనాలను సేకరించగా, వాటిలో బుల్లెట్లతో పాటు రెండు వేరే రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించబడింది.
వివరాలు
అదుపులోకి ఉమర్ నబీకి సంబంధం ఉన్న మరికొందరు
నిందితుడు ఉమర్ నబీకి సంబంధం ఉన్న మరికొందరిని కూడా పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ నబీ ప్రయాణించిన కారులో ఇంకెవరైనా ముందుగా ఉన్నారా, మార్గ మధ్యలో ఎవరైనా దిగారా అనే కోణంలో పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పేలుడు పదార్థాలు ఎక్కడ నుంచి తెచ్చి కారు వరకు ఎలా చేరాయన్న దిశగా కూడా దర్యాప్తు సాగుతోంది.