Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ఊతం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,900 కోట్లు జమ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.2,900.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. ఈ వారంలోనే 18 వేలమంది లబ్ధిదారులకు రూ.202.90 కోట్లను బదిలీ చేసినట్లు ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గౌతమ్ వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,069 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Details
లబ్ధిదారులకు పారదర్శకంగా నిధులు
వాటిలో పునాది దశలో ఉన్న 90,613 ఇళ్లకు రూ.1,610.79 కోట్లు, గోడల నిర్మాణ దశలో ఉన్న 41,212 ఇళ్లకు రూ.716.91 కోట్లు, శ్లాబ్ దశలో ఉన్న 37,400 ఇళ్లకు రూ.572.65 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని బట్టి ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామన్నారు. లబ్ధిదారులందరికీ పారదర్శకంగా నిధులు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఎండీ గౌతమ్ పేర్కొన్నారు.