Holi: హోలీ సంబరాలకు బ్రేక్.. రంగులకు దూరంగా ఆ గ్రామం
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండగ అంటే దేశవ్యాప్తంగా రంగుల హరివిల్లే. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ప్రజలు కులమతాలకు అతీతంగా చిన్నా-పెద్దా భేదం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. అయితే నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తీదేడు (వెంకటంపేట) గ్రామంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. హోలీ రోజున ఆ గ్రామస్తులు చిటికెడు రంగు కూడా ముట్టుకోరు. ఇది తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని, దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. హోలీ సమయానికే గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
Details
పది రోజుల పాటు కనులపండువగా నిర్వహిస్తారు
ఈ ఉత్సవాలను పది రోజులపాటు కనులపండువగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాల మధ్యే హోలీ పండగ రావడంతో, ఆ రోజున ప్రత్యేకంగా రంగుల వేడుకలు జరపరు. ఉత్సవాల్లో భాగంగా ఐదారు రోజులపాటు జరిగే రథోత్సవం సహా అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం చివరి రోజున మాత్రం గ్రామం మొత్తం ఒక్కసారిగా హోలీ సంబరాల్లో మునిగిపోతుంది. ఈ విధంగా తీదేడు గ్రామంలో సంప్రదాయం, భక్తి, పండగ—మొత్తం కలగలిపిన ప్రత్యేక ఆనవాయితీ కొనసాగుతోంది.