Loading...
Andhra Pradesh Semiconductor Hub: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో చిప్‌ల తయారీ పార్క్.. ఏపీకి భారీ పెట్టుబడుల ప్లాన్!
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో చిప్‌ల తయారీ పార్క్.. ఏపీకి భారీ పెట్టుబడుల ప్లాన్!

Andhra Pradesh Semiconductor Hub: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో చిప్‌ల తయారీ పార్క్.. ఏపీకి భారీ పెట్టుబడుల ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. చిప్‌ల తయారీ నుంచి ప్యాకేజింగ్ వరకు రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. సిలికాన్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తాయని లోకేశ్ వివరించారు. డిస్‌ప్లే, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లకు 70 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం రెండో దశ ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు అనుగుణంగా రాష్ట్ర సెమీకండక్టర్ పాలసీని సవరించినట్లు వెల్లడించారు.

వివరాలు

తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్

సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు తిరుపతిలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు.

పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

ఈ రంగంలో పనిచేసేందుకు యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు

శిక్షణ పొందే వారికి నెలకు రూ.10 వేల ప్రోత్సాహకం

సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకునే యువతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది.

శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

భారత్‌కు అవసరమైన చిప్‌లను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేసే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

తయారీ, ప్యాకేజింగ్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని విభాగాల్లో ఏపీని అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ADVERTISEMENT