కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం
వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన భూమి కావడమే ఇందుకు కారణం. కర్నూలు జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం వేటను ప్రారంభించారు. మెరిసే ఏ చిన్న రాయి దొరికినా, పరుగు పరుగున వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తున్నారు. అయితే తాజాగా కర్నూలు జిల్లా మద్దెకర మండలంలోని బసానేపల్లిలో ఓ వ్యక్తి వజ్రం దొరికినట్లు ప్రచారం జరిగింది. దాని విలువ ఏకంగా రూ.2కోట్లని చెబుతున్నారు.
వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడిన వ్యాపారులు
అయితే వజ్రం దొరిగిన విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బసానేపల్లి గ్రామంలో ఓ రైతు పొలం దున్నుతుండగా, వజ్రం కనిపించినట్లు తెలుస్తోంది. అతను వెంటనే దాన్ని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఆ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి బసానేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చివరికి ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.2కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. వర్షాలు పడినప్పుడల్లా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం ప్రజలు వజ్రాల వేటతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.