సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి
ఈ వార్తాకథనం ఏంటి
సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.
ఈ దాడిలో ఆ వ్యక్తి తన భార్యను కూడా గాయపర్చినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహావల్లే ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామానుజ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. తమ కుమార్తె టెర్రస్‌పై పడుకున్న విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. కోపోద్రిక్తుడై కన్న కూతురును హత్య చేశాడు.
సూరత్
తల్లిని కాపాడుకున్న పిల్లలు
సుమారు రాత్రి 11.20 గంటల సమయంలో రామానుజు పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేసిన వీడియో సీపీటీవీలో రికార్డు అయ్యింది.
ఈ క్రమంలో పిల్లలు తమ తల్లిని కాపాడుకునేందుకు తండ్రిని నిలువరించే ప్రయత్నం చేశారు. పిల్లులు తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామానుజ చేతికి చిక్కిన కుమార్తెపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు.
కుమార్తెను హత్య చేసిన తర్వాత రామానుజు తన భార్యను కూడా హతమార్చాలని నిశ్చయించుకుని ఆమెను వెంబడించాడు. ఈ క్రమంలో మిగిలిన పిల్లలు తల్లిని అతనికి చిక్కకుండా దాచి పెట్టారు.
విషయం తెలుసుకున్న సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన వచ్చి రామానుజను పట్టుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకొని, అరెస్టు చేశారు.