Page Loader
Musi River: ముసీకి పెరుగుతున్న ముప్పు.. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం
ముసీకి పెరుగుతున్న ముప్పు.. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం

Musi River: ముసీకి పెరుగుతున్న ముప్పు.. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో మూసీ నదిపై నిర్మించిన మూసీ జలాశయానికి పూడిక ముప్పు పెరుగుతోంది. ప్రతి ఏటా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుండగా, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్, రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతల ద్వారా సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 87 జలాశయాల్లో పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుండగా, వాటిలో తెలంగాణకు చెందిన రెండు జలాశయాలు కూడా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో ఉస్మాన్‌సాగర్‌, మూసీ జలాశయాలున్నాయి. మూసీ జలాశయంలో 15.32 శాతం సెడిమెంటేషన్‌ (పూడిక) పేరుకుపోయిందని, తక్షణ పరిరక్షణ చర్యలు అవసరమని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.

Details

0.74 టీఎంసీల నీటి నిల్వ తగ్గుదల 

1962లో 42 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 4.83 టీఎంసీల స్థాపిత సామర్థ్యంతో మూసీ జలాశయాన్ని నిర్మించారు. దీనిలో నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలుగా ఉండగా, 2024 నాటికి 0.74 టీఎంసీల (15.32 శాతం) మేరకు పూడిక చేరింది. ఫలితంగా, నీటి నిల్వ సామర్థ్యం 3.72 టీఎంసీలకు తగ్గిపోయి, ఆయకట్టు 33 వేల ఎకరాలకు పరిమితమైంది. మూసీ నదికి వరదలు వచ్చే సమయంలో ఉపనదులు, వాగుల ద్వారా ఇసుక, మట్టి పేరుకుపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలాగే నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాల నుంచి వచ్చి చేరుతున్న మురుగు, వినియోగించిన నీరు కూడా దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి. నది ఒడ్డు కోతకు గురికావడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.

Details

జలాశయం భవిష్యత్‌కు ముప్పు 

సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం, 2084 నాటికి మూసీ జలాశయం సామర్థ్యం మరో 1 టీఎంసీ మేర తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వరదల సమయంలో దిగువ తూములను తెరవడం, వరద గేట్ల నిర్వహణను సమర్థంగా చేయడం ద్వారా పూడిక ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని సూచించారు. అలాగే మూసీ ఎగువ ప్రాంతంలో నది తీరప్రాంతం కోతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది. ప్రతి ఐదేళ్లకోసారి హైడ్రోగ్రాఫిక్‌ సర్వే నిర్వహించడం ద్వారా పూడిక పెరుగుదల శాతం గుర్తించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించుకోవచ్చని పేర్కొంది.